![పన్నుల వసూళ్లు వేగవంతం చేయాలి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10nrl222-340154_mr-1739214573-0.jpg.webp?itok=6P7v1x0t)
పన్నుల వసూళ్లు వేగవంతం చేయాలి
● అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్
నిర్మల్‌ఖిల్లా: జిల్లాలోని మున్సిపాలిటీల్లో పన్నుల వసూళ్లు వేగవంతం చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీల ప్రత్యేక అధికారి ఫైజాన్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మూడు మున్సిపాలిటీల అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆస్తి, వాణిజ్య, నీటి, వ్యాపార ప్రకటనల పన్నుల వసూలును వంద శాతం పూర్తి చేయాలని ఆదేశించారు. పన్ను వసూలు లక్ష్యం, ఇప్పటి వరకు వసూలు చేసిన వివరాలను మున్సిపాలిటీల వారీగా అడిగి తెలుసుకున్నారు. అధిక మొత్తంలో పన్ను చెల్లించని వారి జాబితాను సిద్ధం చేసి, నోటీసులను జారీ చేయాలన్నారు. ప్రభుత్వ వాణిజ్య సముదాయాల అద్దెలు వసూలు చేయాలన్నారు. వాణిజ్య లైసెన్సుల పునరుద్ధరణ ప్రక్రియ కూడా త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. మున్సిపాలిటీల పరిధిలో నర్సరీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పట్టణాల్లో అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే జరిమానా విధించాలని తెలిపారు. ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలనుకున్న వారు ముందస్తుగా మున్సిపల్ అధికారుల అనుమతి తీసుకోవాలన్నారు. సమావేశంలో నిర్మల్, ఖానాపూర్, భైంసా మున్సిపాలిటీల కమిషనర్లు జగదీశ్వర్‌గౌడ్, జాదవ్ కృష్ణ, రాజేశ్‌కుమార్, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, డీఈలు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment