![ఒత్తి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/11nrl76-340029_mr-1739299665-0.jpg.webp?itok=xoa-r8hP)
ఒత్తిడికి చెక్.. టెలిమానస్
● అందుబాటులో టోల్‌ఫ్రీ నంబర్ ● ఇంటర్ విద్యార్థులకు ప్రయోజనం ● మానసిక నిపుణులతో సలహాలు ● ఉత్తమ ఫలితాల సాధనకు దోహదం
లక్ష్మణచాంద: ఇంటర్ విద్యార్థుల సిలబస్ పూర్తయింది. ఇటీవలే మొదటి ప్రీఫైనల్ పరీక్షలు కూడా ముగిశాయి. ప్రయోగ పరీక్షలు కొనసాగుతున్నాయి. వార్షిక పరీక్షల సమయం దగ్గర పడుతోంది. గతేడాది కంటే ఈసారి మరింత మెరుగైన ఫలితాలు రాబట్టేందుకు ఆయా కళాశాలల అధ్యాపకులు విద్యార్థులను అన్ని రకాలుగా తీర్చిదిద్దుతున్నారు. నిత్యం స్టడీ హవర్స్ నిర్వహిస్తూ విద్యార్థులకు వచ్చిన సందేహాలను వెంటవెంటనే నివృత్తి చేస్తున్నారు. అయితే కొందరిలో వార్షిక పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో పరీక్షలంటే భయం, ఆందోళన సర్వసాధారణం. పరీక్షల్లో పాస్ అవుతామో.. లేదోనని, తక్కువ మార్కులు వస్తాయేమోనని భయపడతారు. కొన్నిసార్లు ఆశించిన మార్కులు రాకపోతే ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు గతంలో చోటు చేసుకున్నాయి. ఇలాంటి ఘటనలు గతంలో చూసిన కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల్లో పరీక్షలంటే నెలకొన్న భయాన్ని పోగొట్టి వారి మానసిక పరిస్థితిని మెరుగుపరిచి వారిలో మనోధైర్యం నింపేందుకు టెలిమానస్ అనే వినూత్న కార్యక్రమాన్ని తీసుకువచ్చింది. ఇందుకు గాను టోల్ ఫ్రీ నంబర్ 14416ను అందుబాటులోకి తీసుకువచ్చింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రారంభించిన నేషనల్ టెలిమెంటల్ హెల్త్ ప్రోగ్రాం ఆఫ్ ఇండియాలో భాగంగా ఈ కార్యక్రమం అమలు చేస్తున్నారు.
మానసిక స్థితి మెరుగుపరిచేందుకు..
టెలిమానస్ అనేది టెలిమెంటల్ హెల్త్ అసిస్టెన్స్ నే షనల్ టెలిమెంటల్ హెల్త్ ప్రోగ్రాం ఆఫ్ ఇండియా కార్యక్రమంలో ముఖ్యమైంది. పరీక్షల సమయంలో విద్యార్థుల్లో నెలకొన్న భయాన్ని పారదోలి విద్యార్థుల మానసిక స్థితిని మెరుగు పరచడం దీని ము ఖ్య ఉద్దేశం. పరీక్షల సమయంలో ఒత్తిడికి లోనయ్యే విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగకరమైందని వైద్యశాఖ, మానసిక నిపుణులు చెబుతున్నారు.
సద్వినియోగం చేసుకోవాలి
టెలిమానస్ ఇంటర్ విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంది. పరీక్షలంటే భయం, ఆందోళన ఉన్నవారు టోల్ ఫ్రీ నంబర్ 14416కు ఫోన్ చేస్తే వెంటనే శిక్షణ పొందిన మానసిక నిపుణులు విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇస్తారు. వారిలోని భయాన్ని పోగొడతారు. దీనిని సద్వినియోగం చేసుకోవాలి. – సురేశ్, మానసిక వైద్యనిపుణుడు
అవగాహన కల్పిస్తే మేలు
పరీక్షల సమయంలో ఒత్తిడికి గురయ్యే విద్యార్థులు టోల్‌ఫ్రీ నంబర్ 14416కు ఫోన్ చేసి తగిన సాయం పొందవచ్చు. ఈ సేవలు 24 గంటలు అందుబాటులో ఉంటాయి. ఫోన్ చేయగానే శిక్షణ పొందిన మానసిక నిపుణులు విద్యార్థుల సమస్యలను పూర్తిగా విని తగిన సలహాలు, సూచనలు ఇస్తారు. టెలిమానస్ కార్యక్రమంపై కళాశాలలో పోలీస్, వైద్యారోగ్యశాఖ సిబ్బంది ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులకు అవగాహన కల్పిస్తే వారికి మేలు చేకూరుతుందని పోషకులు భావిస్తున్నారు.
![ఒత్తిడికి చెక్.. టెలిమానస్1](https://www.sakshi.com/gallery_images/2025/02/12/staticobject_mr-1739299665-1.jpg)
ఒత్తిడికి చెక్.. టెలిమానస్
Comments
Please login to add a commentAdd a comment