ఊర కుక్కల వీరంగం
నగరంలో స్కూలు విద్యార్థులు, ఎడపల్లి మండలంలో గ్రామస్తులపై దాడి
నిజామాబాద్ సిటీ/ఎడపల్లి (బోధన్) : నిజామాబాద్ నగరం, ఎడపల్లి మండలంలో మంగళవారం వీధి కుక్కలు బీభత్సం సృష్టించాయి. నగరంలోని పాతబస్తీలోని అహ్మద్‌పుర కాలనీ, మాలపల్లి మధ్యలో నాలుగు కుక్కలు పిచ్చిపట్టినట్లుగా స్కూలు పిల్లలపై ఒక్కసారిగా దాడి చేశాయి. అడ్డు వెళ్లిన స్థానికులు ఇద్దరిని కుక్కలు గాయపర్చాయి. స్కూలు విద్యార్థులు ఎండీ తఖీఫ్, సోఫియా ఖాన్, అబ్దుల్ ఫసీ, ఉజ్మా, ఖాజా, షహీద్, అల్మాస్ కుక్కల దాడిలో తీవ్ర గాయాల పాలయ్యారు. కాళ్లు, చేతులు, తొడలు, కంటి భాగంపైన విద్యార్థులకు గాయాలయ్యాయి. గాయపడ్డ పిల్లలను తల్లిదండ్రులు జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. బల్దియా అధికారులు వీధి కుక్కలను నివారించడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎడపల్లి మండలంలోని దుబ్బ తండా గ్రామంలో ముగ్గురు, ఏఆర్పీ క్యాంపు గ్రామంలో ఇద్దరు వీధి కుక్కలు దాడిలో గాయపడ్డారు. ఏఆర్‌పీ క్యాంపు గ్రామంలో బాలిక తీవ్రంగా గాయపడింది.
Comments
Please login to add a commentAdd a comment