లక్ష్యానికి దూరంగా..
● సేకరించిన ధాన్యం 4.60 లక్షల మెట్రిక్ టన్నులే..
● నిర్దేశించింది 8 లక్షల మెట్రిక్ టన్నులు
● 150కి పైగా కొనుగోలు కేంద్రాల మూసివేత..
● రూ.850 కోట్లకుపైనే
రైతుల ఖాతాల్లో జమ
● రూ.100 కోట్ల వరకు బోనస్ చెల్లింపు..
సుభాష్‌నగర్ : ధాన్యం సేకరణలో రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానంలో ఉన్నప్పటికీ.. లక్ష్యాన్ని చేరుకోలే కపోయింది. 90 శాతానికిపైగా సేకరణ పూర్తి కాగా, ఇప్పటి వరకు కేవలం రూ.4.60 లక్షల మెట్రిక్ ట న్నుల ధాన్యం మాత్రమే సేకరించారు. మరోవారం, పది రోజుల్లో జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రా లు సేయనున్నారు. సుమారు 52 వేల మంది రైతులకు రూ.850 కోట్ల వరకు ధాన్యం డబ్బులు చెల్లించగా, 26,861 మంది రైతులకు రూ.99.51 కోట్ల బోనస్ రైతుల ఖాతాల్లో జమ చేశారు.
● జిల్లాలో ధాన్యం సేకరణ కోసం 676 కొనుగోలు కేంద్రాలను ప్రతిపాదించారు. ఈ సీజన్‌లో ప్రభు త్వం బోనస్ ప్రకటించడంతో సన్నరకాలు, దొడ్డు రకాలకు వేర్వేరుగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. 673 కేంద్రాలను ప్రారంభించగా, 65,425 మంది రైతుల నుంచి ధాన్యం సేకరించారు. 2.98 లక్షల మెట్రిక్ టన్నులు సన్నరకాలు, దొడ్డు రకాలు 1.62 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించారు. ధాన్యం సేకరణ పూర్తి కావస్తుండటంతో ఇప్పటికే సుమారు 150 పైగా సెంటర్లను మూసేశారు.
5 లక్షల మెట్రిక్ టన్నులు కూడా డౌటే..
వానాకాలం సీజన్‌లో 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యం పెట్టుకున్న అధికారులు ఇప్పటి వరకు 4.60 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సేకరించారు. కేంద్రాలు మూసేసే నాటికి 5 లక్షల మెట్రిక్ టన్నులు కూడా చేరుకోకపోవచ్చని భావిస్తున్నారు. వర్ని, మోస్రా, చందూర్, రుద్రూర్, ఎడపల్లి, మోపాల్ తదితర మండలాల్లో రైతులు పచ్చి ధాన్యాన్ని అమ్మేసుకున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, నల్గొండ, సూర్యాపేట్‌తో పాటు జిల్లాలోని రైస్‌మిల్లర్లు, వ్యాపారులు ధాన్యం కొనుగోలు చేశారు. ప్రభుత్వం సన్నాలకు బోనస్ ప్రకటించినప్పటికీ ఇస్తుందో.. లేదోనన్న సందేహంతో చాలామంది రైతులు వ్యాపారులకు అమ్ముకున్నారు. తీరా ప్రభుత్వం బోనస్ జమ చేస్తుండటంతో ఆ రైతులంతా నష్టపోయారు. మరోవైపు పౌరసరఫరాశాఖ అధికారులు నిర్దేశించుకున్న లక్ష్యం చేరుకోలేకపోయారు.
52వేల మంది రైతులకు చెల్లింపులు
రైతులు ధాన్యం విక్రయించి, సంబంధిత ధ్రువపత్రాలు సమర్పించిన వారం రోజుల్లోనే వారి ఖాతాల్లో డబ్బులు జమయ్యాయి. ఎక్కడ కూడా జాప్యం జరగకుండా అధికారులు, ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. 65,425 మంది రైతుల నుంచి 4.60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగా, ఇప్పటికే 52 వేల మంది రైతులకు సుమారు రూ.850 కోట్ల వరకు చెల్లింపులు పూర్తి చేశారు. ట్యాబ్ ఎంట్రీ ఈసారి కొంత కఠినతరం చేయడంతో కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
26,861 మందికి బోనస్..
ప్రభుత్వం సన్నరకాలకు బోనస్ ప్రకటించిన ప్రకారం రైతులకు రూ.500 జమ చేస్తుండటంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 26,861 మంది రైతులకు రూ.99.51కోట్ల బోనస్ డబ్బులు జమ చేసింది. ధాన్యం మద్దతు ధర డబ్బులతో కాకుండా బోనస్ డబ్బులు వేరుగా జమ చేస్తున్నారు.
వారం రోజుల్లో కేంద్రాలు మూసేస్తాం..
జిల్లాలో 90 శాతానికిపైగా ధాన్యం సేకరణ పూ ర్తయినట్లే. చివరి గింజ వరకు ధాన్యం సేకరించి మరో వారం, పదిరోజుల్లో కొనుగోలు కేంద్రాలను మూసేస్తాం. నిర్దేశించిన లక్ష్యం మేరకు సేకరించకపోయినా.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా సేకరించాం. కడ్తా, తరుగు అనే పదాలకు తావివ్వకుండా రైస్‌మిల్లర్లు ధాన్యం దించుకున్నారు. – అరవింద్‌రెడ్డి, జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి
Comments
Please login to add a commentAdd a comment