ఖలీల్‌వాడి: భార్య కాపురానికి రావడం లేదని ఓ వ్యక్తి మనస్తాపంతో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఐదో టౌన్ ఎస్సై గంగాధర్ మంగళవారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని నాగారం ప్రాంతానికి చెందిన షేక్ సలీం(31) ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి 18 నెలల క్రితం భీంగల్ పట్టణానికి చెందిన షేక్ ఇస్తానాతో వివాహమైంది. అతను గతేడాది నుంచి మద్యానికి బానిసై ఎలాంటి పనిచేయడం లేదు. దీంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో అతిగా మద్యానికి బానిసయ్యాడు. భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపంతో నాగారంలోని ప్రాంతంలో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గంగాధర్ పేర్కొన్నారు.
మద్యానికి బానిసై మరొకరు..
గాంధారి: మద్యానికి బానిసైన ఒకరు జీవితంపై విరక్తితో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన గాంధారి మండలం సర్వాపూర్‌లో చోటుచేసుకుంది. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ముదెల్లి పోచయ్య(45) జీపీ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. కొంత కాలంగా అతను మద్యానికి బానిసై డబ్బుల కోసం భార్య వినోదను ఇబ్బంది పెట్టేవాడు. మంగళవారం ఉదయం మద్యానికి డబ్బులు కావాలని భార్యను అడిగాడు. ఆమె డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో కొట్టాడు. ఆమె బయటకు వెళ్లిపోయిన సమయంలో పోచయ్య ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
తల్లిదండ్రులు లేరని..
బోధన్‌రూరల్: తనకు తల్లిదండ్రులు లేరనే మనస్తాపంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన బోధన్ మండలంలోని సంగం గ్రామంలో చోటు చేసుకుంది. బోధన్ రూరల్ ఎస్సై మచ్చేందర్‌రెడ్డి మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మనీష(జానకి)(18)కి చిన్న నాటి నుంచి తల్లిదండ్రులు లేకపోవడంతో బంధువుల వద్ద ఉంటోంది.
తనకు అందరిలా తల్లిదండ్రులు లేరనే మనస్తాపంతో ఈ నెల 2న రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి బంధువు సుంకరి రేఖ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment