యువతి అదృశ్యం
లింగంపేట: మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి అదృశ్యమైనట్లు ఎస్సై సురేందర్ మంగళవారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన యువతి తల్లిదండ్రులు ఈ నెల 2న బంధువుల వివాహ నిమిత్తం వేరే గ్రామానికి వెళ్లారు. సాయంత్రం ఇంటికి వచ్చే సరికి తన కుమార్తె లేకపోవడంతో తల్లిదండ్రులు పలుచోట్ల వెతికినా ఆచూకీ లభించలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
నవీపేటలో యువకుడు..
నవీపేట: మండలంలోని స్టేషన్ ఏరియాకు చెందిన రాజేశ్ అనే యువకుడు అదృశ్యమైనట్లు ఎస్సై వినయ్ మంగవారం తెలిపారు. ఆరు నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లిన అతను తిరిగి రాలేదు. రాజేశ్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. అశోక్ తల్లి కళావతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. కుమారుని అదృశ్యంపై అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తిపై అనుమానం ఉన్నట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొందని తెలిపారు.
మంగళ్‌పాడ్‌లో మరొకరు..
ఎడపల్లి: మండలంలోని మంగళ్‌పాడ్ గ్రామానికి చెందిన నరేందర్ అనే వ్యక్తి అదృశ్యమైనట్లు ఎస్సై తెలిపారు. గ్రామానికి చెందిన నరేందర్ బోధన్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో దోబి పని చేస్తున్నాడు. ప్రతి రోజుల ఉదయం వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చేవాడు. గత నెల 19న ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. నరేందర్ భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
షార్ట్ సర్క్యూట్‌తో
ఇల్లు దగ్ధం
బాల్కొండ: మెండోరా మండల కేంద్రానికి చెందిన సాయన్న, శ్రీనివాస్‌లకు చెందిన ఇల్లు మంగళవారం దగ్ధమైంది. మెండోరా ఎస్సై నారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సాయన్న, శ్రీనివాస్ ఇంట్లో ఉన్న ఫ్రిజ్‌కు షార్ట్‌సర్క్యూట్ సంభవించడంతో ఇంట్లో మంటలు వ్యాపించాయి. వెంటనే కుటుంబీకులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించడంతో వారు సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఇల్లు పూర్తిగా దగ్ధమైందని ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment