బైక్ చోరీ కేసులో ఒకరికి ఏడాది జైలు
కమ్మర్‌పల్లి: బైక్ చోరీ కేసులో నిందితుడికి ఏడాది జైలుశిక్ష పడినట్లు కమ్మర్‌పల్లి ఎస్సై అనిల్‌రెడ్డి తెలిపారు. మండలంలోని చౌట్‌పల్లికి చెందిన సమర గంగాజమునకు చెందిన బైక్ చోరీకి గురైంది. ఈమేరకు పీఎస్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం వెల్లుల్ల గ్రామానికి చెందిన బోదాసు మహేశ్‌ను అరెస్ట్ చేసి ఆర్మూర్ కోర్టుకు తరలించారు. కేసు విచారణ అనంతరం పూర్వపరాలను పరిశీలించిన ప్రథమ శ్రేణి మెజిస్ట్రేట్ దీప్తి మంగళవారం తీర్పును వెలువరించారు. నిందితుడికి ఏడాది జైలుశిక్షను విధించారు. కోర్టులో సాక్షులను ప్రవేశపెట్టడంలో కీలక పాత్ర పోషించిన కానిస్టేబుళ్లు రామారావు, రాజులను ఎస్సై అనిల్ రెడ్డి అభినందించారు.
అర్ధరాత్రి షాపు తెరిచిన వ్యక్తికి రెండు రోజులు..
ఖలీల్‌వాడి: నగరంలోని చంద్రశేఖర్‌కాలనీ చెందిన మోహన్ తన కిరాణ దుకాణాన్ని ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిమితికి మించి రాత్రి తెరిచి ఉంచటంతో కేసు నమోదు చేసినట్లు మూడో టౌన్ ఎస్సై మహేశ్ మంగళవారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం నవంబర్ 30న తన కిరాణషాప్ దుకాణాన్ని తెరిచి ఉంచడంతో కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చగా సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ మోహన్‌కి రెండు రోజుల జైలు శిక్ష విధించారు. మూడో టౌన్ పరిధిలో ఎవరైనా ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిమితికి మించి షాపులు తెరిచి ఉంచితే చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.
రూ.3.85 కోట్ల గంజాయి,
అల్ప్రాజోలం కాల్చివేత
కామారెడ్డి క్రైం: జిల్లా వ్యాప్తంగా 36 కేసుల్లో పట్టుబడిన రూ. 3.51 కోట్ల విలువ చేసే గంజాయి, అల్ప్రాజోలాన్ని సంబంధిత అధికారులు కాల్చివేశారు. నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం పడకల్‌లో ఉన్న శ్రీ మెడికేర్ సర్వీస్ కేంద్రంలో మంగళవారం ఆయా మత్తు పదార్థాలను దగ్ధం చేశారు. కాల్చి వేసిన వాటిలో కామారెడ్డి జిల్లాలోని ఐదు ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన 36 కేసులకు సంబంధించి 783.36 కిలోల గంజాయి, 16.625 కిలోల అల్ప్రాజోలం, 1.15 కిలోల డైజోఫాం, 852 గ్రాముల క్లోరల్ హైడ్రైట్, 230 గంజాయి మొక్కలు ఉన్నట్లు ఎకై ్సజ్ సూపరింటెండెంట్ హన్మంత్ రావు తెలిపారు. కాల్చి వేసిన మత్తు పదార్థాల విలువ రూ.3,85,71,325 ఉంటుందని అన్నారు.
సబ్‌మెర్సిబుల్ మోటారు చోరీ
సిరికొండ: మండలంలోని తాళ్లరామడుగులో బోరు బావి నుంచి సబ్‌మెర్సిబుల్ మోటారును తొలగించి దుండుగులు ఎత్తుకెళ్లారని బాధితుడు సాయిరి కృష్ణ మంగళవారం తెలిపారు. వ్యవసాయ పొలం వద్ద సోమవారం సాయంత్రం వరకు అక్కడే ఉన్నానని, మంగళవారం ఉదయం వెళ్లి చూసేసరికి బోరు బావిలో నుంచి మోటారును ఎత్తుకెళ్లారని పేర్కొన్నారు. కేబుల్ తీగలను, ఇతర సామాగ్రిని అక్కడే వదిలేసి 7.5 హెచ్‌పీ మోటారును ఎత్తుకెళ్లారని తెలిపారు. చోరీ అయిన మోటారు విలువ రూ. యాభై వేల విలువ ఉంటుందని అన్నారు. ఘటనపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు బాధితుడు పేర్కొన్నాడు.
సుభాష్‌నగర్‌లో చైన్ స్నాచింగ్
ఖలీల్‌వాడి: సుభాష్‌నగర్ కాలనీలోని ఓ కిరాణ దుకాణంలో చైన్ స్నాచింగ్ జరిగినట్లు మూడో టౌన్ ఎస్సై మహేశ్ తెలిపారు. ఎస్సై మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. సుభాష్‌నగర్ ప్రాంతంలోని వెంకటరెడ్డి కాంప్లెక్స్‌లో ఉన్న కిరాణ దుకాణానికి ఓ వ్యక్తి వచ్చి సిగరెట్, కూల్ డ్రింక్ తాగి డబ్బులను యజమాని రజినికి ఇచ్చాడు. ఆమె డబ్బులను కౌంటర్‌లో పెడుతుండగా సదరు వ్యక్తి ఆమె మెడలో ఉన్న రెండు తులాల బంగారు చైన్‌ను లాక్కొని బైక్‌పై పరారయ్యాడు. బాధితురాలు రజిని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment