ఏం చేశారని విజయోత్సవాలు
నిజామాబాద్ సిటీ: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా సీఎం రేవంత్‌రెడ్డి ఏ ముఖం పెట్టుకుని ప్రజాపాలన–విజయోత్సవాలు నిర్వహిస్తారని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా మండిపడ్డారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని నెహ్రూపార్కు వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. 26 ప్రశ్నలతో సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖను రాసి పోస్టుచేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఏడాది కాలంగా రాష్ట్ర ప్రజలకు ఏం చేశారని అన్నారు. ప్రజాపాలన పేరుతో ప్రజాధనం వృథా తప్ప ఒరిగేందేమి లేదన్నారు. తాను సంధించిన ప్రశ్నలకు సీఎం రేవంత్ రెడ్డి సమాధానాలివ్వాలని డిమాండ్ చేశారు.
ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేయనందుకు, కౌలు రైతులకు భరోసా ఇవ్వనందుకు, వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు, పేదింటి మహిళలకు రూ.2500, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకంలో తులం బంగారం ఇవ్వనందుకు విజయోత్సవాలు జరుపుతున్నారా అని ప్రశ్నించారు. చదువుకునే అమ్మాయిలకు స్కూటీ, నిరుపేదలకు ఇస్తామన్న ఇందిరమ్మ ఇళ్లు, నిరుద్యోగ భృతి, పెంచుతామన్న పింఛన్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. గురుకులాల్లో ఆహారంలో కల్తీ నియంత్రణ ఏది? జర్నలిస్టులకు ఇస్తానన్న రూ. 100 కోట్ల నిధులేమాయే? హిందూ దేవతల గుడులపై దాడులు జరుగుతున్నా మౌనం వహిస్తున్నందుకు విజయోత్సవాలు జరుపుతున్నారా అని సీఎంను ధన్‌పాల్ ప్రశ్నలు సంధించారు. ఏడాది కాలంలో తెలంగాణను అంధకారంలోకి నెట్టారని విమర్శించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు, నాయకులు స్రవంతిరెడ్డి, న్యాలం రాజు, కిశోర్ పాల్గొన్నారు.
ప్రజాపాలన విజయోత్సవాలపై
అర్బన్ ఎమ్మెల్యే మండిపాటు
సీఎంకు 26 ప్రశ్నలు సంధించిన
ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా
Comments
Please login to add a commentAdd a comment