అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం
నిజామాబాద్ సిటీ: పదేళ్ల బీఆర్‌ఎస్ రాక్షస పాలనకు చరమగీతం పాడి ప్రజాపాలన అందిస్తున్నామని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్‌లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అభివృద్ధిపై ఎవరితోనైనా, ఎక్కడైనా బహిరంగ చర్చకు తాము సిద్ధమేనని, విపక్షాల తప్పుడు ఆరోపణలను కాంగ్రెస్ శ్రేణులు తిప్పికొట్టాలని సూచించారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చగా, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభివృద్ది పథంలో నడిపిస్తున్నారన్నారు. ఎన్నికల హామీ మేరకు సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, రూ.500కు గ్యాస్ సిలిండర్, ఆరోగ్యశ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంపు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ ఏర్పాటు, రైతు రుణమాఫీ, రైతు భరోసా, పంటలబీమా, సన్న ధాన్యానికి రూ.500 బోనస్ వంటివి అమలు చేశామన్నారు. 50 వేల ఉద్యోగాలు ఇవ్వడంతోపాటు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చామని మానాల తెలిపారు. మహాలక్ష్మి పథకం ద్వారా జిల్లాలో 3 కోట్ల 26 లక్షల మంది లబ్ధి పొందారని, గృహజ్యోతి ద్వారా 2.47 కోట్ల కుటుంబాలకు జీరో బిల్లులు వస్తున్నట్లు వివరించారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించి ఉత్తర తెలంగాణ రైతులకు మేలు చేస్తామని హామీ ఇచ్చారు. ఇన్ని పథకాలు అమలు చేస్తున్నా బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు ప్రజలకు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికై నా బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు వాస్తవాలు గ్రహించాలన్నారు. సమావేశంలో కాంగ్రెస్ నగర అధ్యక్షుడు, నుడా చైర్మన్ కేశ వేణు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, పీసీసీ డెలిగేట్ శేఖర్‌గౌడ్, నాయకులు జావేద్ అక్రం, రత్నాకర్, వేణురాజ్, రాజనరేందర్‌గౌడ్, సంతోష్, బోర్గాం శ్రీనివాస్, అఖిల్, శశికుమార్, సాయికిరణ్ పాల్గొన్నారు.
విపక్షాల ఆరోపణలను కాంగ్రెస్ శ్రేణులు తిప్పికొట్టాలి
డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment