బోర్డు కోసం..
● ఇందూరులోనే ఏర్పాటు
చేయించేందుకు ఢిల్లీలో ఎంపీ
అర్వింద్ పట్టువదలని కృషి
● ఇప్పటికే ప్రధాని అధికారిక ప్రకటన
● బోర్డును తరలించుకుపోయేందుకు
మహారాష్ట్రకు చెందిన సీనియర్ కేంద్రమంత్రుల ప్రయత్నాలు
● బోర్డు డైరక్టర్ల నియామకానికి ఇప్పటికే కేంద్రం కసరత్తు
● పసుపు బోర్డు వస్తే జిల్లా నుంచే
అంతర్జాతీయ ఎగుమతులు
● జిల్లాకు పసుపు శుద్ధి, కర్క్యుమిన్, ఆయిల్ పరిశ్రమలు తరలివచ్చే అవకాశం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: పసుపు బోర్డు విష యంలో పట్టిన పట్టు విడువకుండా గట్టిగా కృషి చేసి చరిత్ర సృష్టించిన ఎంపీ ధర్మపురి అర్వింద్ మరిన్ని అడుగులు వేస్తున్నారు. తెలంగాణకు పసు పు బోర్డు ఇస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ప్రకటన చేయించారు. కేంద్ర కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం గెజిట్ సైతం విడుదల చేసింది. తర్వాత కేంద్రంలో నంబర్‌టూ గా ఉన్న హోంమంత్రి అమిత్‌షాతో ఇందూరు జిల్లాలోనే ఏర్పాటు చేస్తామని ప్రకటన చేయించారు. దేశంలో ఇప్పటివరకు స్పైసెస్ బోర్డు పరిధిలో ఒక పంటగా ఉన్న పసుపు పంటకు ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేయించే విషయంలో అర్వింద్ ప్రత్యేకమైన ఘనత సాధించారు. అయితే పసుపు పంటకు సంబంధించి నిజామాబాద్ మార్కెట్‌తో పాటు సరిహద్దునే ఉన్న మహారాష్ట్రలో పేరెన్నిక గన్న సాంగ్లి మార్కెట్ సైతం అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగి ఉంది. మహారాష్ట్రలోని నాందేడ్, హింగోలి, సాంగ్లి, షోలాపూర్, కొల్హాపూర్ తదితర ప్రాంతాల్లో పసుపు పంటను బాగానే పండిస్తున్నారు. ఈ నేపథ్యంలో పసుపు బోర్డును మహారాష్ట్రకు తరలించుకుని వెళ్లేందుకు గాను మహారాష్ట్రకే చెందిన కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఎంపీ అర్వింద్ ఏమా త్రం అవకాశమివ్వకుండా ఢిల్లీలో పట్టు వదలకుండా ఇందూరులో పసుపు బోర్డు ఏర్పాటు కోసం కృతనిశ్చయంతో ఉన్నారు. మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో ఈ విషయమై ఇటీవలి కాలం వరకు సైలెంట్‌గా ఉన్న అర్వింద్ ప్రస్తుతం ఢిల్లీలో తీవ్ర కృషి చేస్తున్నారు.
చైర్మన్‌గా సీనియర్ నేత ?
పసుపు బోర్డు డైరక్టర్లను నియమించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. సీనియర్ నేతను చైర్మన్‌గా నియమించేందుకు ఆలోచన చేస్తున్నారు. డైరక్టర్లుగా ఐదుగురు సీనియర్ ఐ ఏఎస్ అధికారులు, రైతులు, వ్యవసా య శాస్త్రవేత్తలు, ట్రేడర్లను నియమించేందుకు గాను కేంద్ర ప్రభుత్వం ప్రక్రియ మొదలుపెట్టింది. వ్యవసాయం, వాణి జ్యం, పరిశ్రమల శాఖలు, ఆయుష్, ఫా ర్మాసూటికల్స్ విభాగాల నుంచి రొటేషన్ విధానంలో వివిధ రాష్ట్రాల నుంచి ప్రతినిధులను, పరిశోధనల్లో భాగసామ్యమయ్యే సంస్థలు, పసుపు రైతులు, ఎగుమతిదారుల ప్రతినిధులను సభ్యులు గా నియమించనున్నారు. పసుపు బోర్డు కార్యదర్శి ని కేంద్ర వాణిజ్య శాఖ నియామకం చేయనుంది.
● మహారాష్ట్రలోని సాంగ్లి, తమిళనాడులోని ఈరోడ్ లలో పెద్ద పసుపు మార్కెట్లు ఉన్నప్పటికీ నిజా మాబాద్ పసుపు మార్కెట్ ప్రత్యేకంగా నిలుస్తోంది. అయితే సాంగ్లి మార్కెట్ నుంచి గట్టి పోటీ ఉండడంతో పాటు అక్క డి సీనియర్ కేంద్ర మంత్రులు బోర్డు కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఎంపీఅర్వింద్ పట్టువదలడం లేదు.
నిజామాబాద్‌లోనే 40 శాతం..
వివిధ రాష్ట్రాల ద్వారా 11.61 లక్షల ట న్నుల పసుపు దిగుబడి వస్తోంది. 2022– 23 సీజన్‌లో నిజామాబాద్ మార్కెట్‌కు 75 వేల టన్నుల పసుపు వచ్చింది. 2023–24 సీజన్‌లో నిజామాబాద్ మార్కెట్‌కు 70 వేల టన్నుల పసుపు వచ్చింది. రాష్ట్రంలోని మొత్తం పసుపు సాగులో 40 శాతం నిజామాబాద్ జిల్లాలోనే కావడం గమనార్హం. తరువాతి స్థానాల్లో జగిత్యాల, నిర్మల్, వికారాబాద్, మహబూబాబాద్ జిల్లాలు ఉన్నాయి.
అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్..
భారతీయ రైతులు పండించిన పసుపు పంటకు అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ ఉంది. ఈ క్రమంలో భారత్ నుంచి ప్రతి ఏటా రూ.1,600 కోట్ల మేర పసుపు ఎగుమతులు జరుగుతున్నాయి. అంతర్జాతీయ పసుపు వాణిజ్యంలో భారత్ వాటా ప్రస్తుతం 62 శాతం ఉంది. అయితే ఈ పసుపు ఎగుమతుల వాణిజ్యాన్ని రూ.8,400 కోట్లకు పెంచాలనే లక్ష్యంతో కేంద్రప్రభుత్వం ప్రణాళికలు తయారు చేస్తోంది. దీనికి పసుపు బోర్డు ఎంతగానో ఉపయోగపడనుంది. బోర్డు ఏర్పాటైతే రాష్ట్రంలో ఏటేటా తగ్గుతూ వస్తున్న పసుపు పంట విస్తీర్ణం మళ్లీ పెరిగే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి తగిన ప్రోత్సాహం లభిస్తుంది. బోర్డు ఏర్పాటైతే జిల్లాకు పసుపు శుద్ధి కర్మాగారాలు, కర్క్యుమిన్ యూనిట్లు, కర్క్యుమిన్ ఆయిల్ ఎక్స్‌ట్రాక్ట్ ఎగుమతి యూనిట్లు, వివిధ పసుపు అథారిత పరిశ్రమలు తరలివస్తాయి. అమెరికా, యూఏఈ, బంగ్లాదేశ్, మలేసియా దేశాల్లో భారత పసుపునకు డిమాండ్ ఉంది. బోర్డు ద్వారా భారతదేశం నుంచి అంతర్జాతీయ పసుపు వాణిజ్యం మరింత విస్తృతం అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment