● తుని నుంచి ఆటోలో తరలింపు
● మహేశ్వరంలో పట్టుబడిన తొర్లికొండకు చెందిన నిందితులు
● 62 కిలోల గంజాయి, ఆటో, సెల్‌ఫోన్, రూ.10 వేల నగదు సీజ్
● కేసు వివరాలు వెల్లడించిన మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి
మహేశ్వరం: ఆంధ్రప్రదేశ్‌లోని తుని నుంచి నిజామాబాద్‌కు ఆటోలో గంజాయి తరలిస్తూ జిల్లాకు చెందిన తండ్రీకొడుకు మహేశ్వరం పోలీసులకు పట్టుబడ్డారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి తెలిపారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌లో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించి కేసు వివరాలు వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం తొర్లికొండకు చెందిన ఆటో డ్రైవర్ మహ్మద్ మౌలానా విశాఖపట్నం జిల్లా చింతపల్లికి చెందిన చిట్టిబాబు నుంచి ఆటోలో గంజాయి తీసుకొచ్చి మహారాష్ట్రలోని ధర్మాబాద్‌కు చెందిన ప్రాణహిత అనే మహిళలకు అధిక ధరకు విక్రయించేవాడు. నవంబర్ 30వ తేదీన సాయంత్రం మౌలానా తన కుమారుడు మహ్మద్ ముస్తాఫాతో కలిసి తుని సమీపంలోని తాళ్లపాలెం వద్ద చిట్టిబాబు నుంచి 62.428 కిలోల(30 ప్యాకెట్ల) గంజాయిని రూ.2.10 లక్షలకు కొనుగోలు చేశాడు. ఆటో వెనుక భాగంలో ప్రత్యేకంగా తయారు చేయించిన ఫ్రేమ్‌లో గంజాయి ప్యాకెట్లు లోడ్ చేసుకుని తిరుగు ప్రయాణమయ్యారు. రెగ్యులర్ రూట్‌లో వెళ్తే పోలీసు తనిఖీలుంటాయని మిర్యాలగూడ, దేవరకొండ, కల్వకుర్తి, మహేశ్వరం గేటు నుంచి శ్రీశైలం జాతీయ రహదారి, ఓఆర్‌ఆర్ మీదుగా నిజామాబాద్ వెళ్లాలనుకున్నారు. ఈ నెల 1వ తేదీన మధ్యాహ్నం 12గంటల సమయంలో కల్వకుర్తి నుంచి మహేశ్వరం గేటు వైపు ఆటోలో గంజాయి తరలిస్తున్న క్రమంలో పోలీసులకు అనుమానం వచ్చి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆటోలో తరలిస్తున్న 62.428 కిలోల గంజాయి(30ప్యాకెట్లు), టాటా ఏస్ ఆటో, మొబైల్ ఫోన్, రూ.10 వేల నగదు స్వాధీనం చేసుకుని మౌలానా, ముస్తాఫాను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సోమవారం ఇద్దరు నిందితులను రిమాండ్‌కు తరలించారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. నిందితులను పట్టుకున్న పోలీసులను డీసీపీ అభినందించారు. సమావేశంలో మహేశ్వరం ఏసీపీ లక్ష్మీకాంతరెడ్డి, మహేశ్వరం సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment