నిధుల కోసం ఎదురుచూపులు
● జీజీహెచ్ మరమ్మతులకు
ప్రతిపాదనలు సిద్ధం
● పనులకు రూ.6.62 కోట్లు
అవసరమంటున్న అధికారులు
● మూడు నెలల్లో రూపురేఖలు మారేనా?
నిజామాబాద్‌నాగారం: జిల్లా కేంద్ర ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్) మరమ్మతులకు తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎంఐడీసీ) ప్రతిపాదనలను సిద్ధం చేసింది. రూ.6.62 కోట్ల నిధులు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదించింది. గత నెలలో జిల్లా పర్యటనకు వచ్చిన వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ జీజీహెచ్ భవనంలో లీకేజీలు, స్థానిక పరిస్థితిని చూసి సూపరింటెండెంట్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. భవనానికి వెంటనే మరమ్మతులు చేయించాలని, అవసరమైన నిధులు మంజూరు చేస్తామని, మూడు నెలల్లో జీజీహెచ్ రూపురేఖలు మార్చాలని ఆదేశించారు.
మరమ్మతులు చేపట్టింది లేదు..
ఉమ్మడి రాష్ట్రంలో జీజీహెచ్ ప్రారంభమైంది. ఆ తరువాత ఒక్కసారి కూడా మరమ్మతులు చేపట్టిన దాఖలాలు లేవు. ప్రస్తుత సూపరింటెండెంట్ ఈ ఐదేళ్లలో మరమ్మతుల దిశగా ఆలోచన చేయకపోవడంతో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి పరిసరాలు అధ్వానంగా, అపరిశుభ్రంగా తయారయ్యాయి. భవనం చుట్టూ కింది పైనుంచి కింది వరకు పైప్‌లైన్‌లకు లీకేజీలు ఏర్పడ్డాయి. దీంతో ఎక్కడ చూసినా మురుగునీరు పారుతోంది. భరించలేని దుర్వాసన కారణంగా రోగులు, వారి సహాయకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సూపరింటెండెంట్‌లు ఎంత మంది మారినా మరమ్మతులను పట్టించుకున్న పాపాన పోలేదు.
చేపట్టే పనులు..
వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు టీఎస్‌ఎంఐడీసీ అధికారులు జీజీహెచ్ సూపరింటెండెంట్‌తో సమావేశమై చేపట్టాల్సిన పనులపై చర్చించారు. రూ.6.62కోట్లతో పనులు చేపట్టాలని ప్రతిపాదించారు. ఇందులో ప్రధానంగా రూ.కోటీ 65లక్షలతో డ్రైనేజీ పైపులైన్, టాయిలెట్స్, రూ.35లక్షలతో భవనం ఎలివేషన్, అదనపు పనులు, క్రిటికల్ కేర్‌కు రూ.89 లక్షలు, భవనం పెయింటింగ్‌కు రూ.2కోట్ల 35లక్షలు, తదితర పనులకు మొత్తం రూ.6.62 కోట్లు అవసరమని ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
మంత్రి ఆదేశాల మేరకు..
మంత్రి ఆదేశాల మేరకు జీజీహెచ్‌ను పరిశీలించాం. సూపరింటెండెంట్ సలహాలు, సూచనలు పరిగణనలో కి తీసుకొని మరమ్మతులకు ప్రతిపాదనలు సిద్ధం చేశాం. రూ.6.62 కోట్లు అవసరం ఉంది.
– కుమార్, ఈఈ, టీఎస్‌ఎంఐడీసీ
ఉన్నతాధికారులకు విన్నవించాం
మంత్రి ఆదేశాల ప్రకారం టీఎస్‌ఎంఐడీసీ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నిధుల కోసం ఉన్నతాధికారులకు విన్నవించాం. త్వరలోనే నిధులు మంజూరయ్యే అవకాశాలున్నాయి. – రాజశేఖర్, ఏఈడీ, జీజీహెచ్
Comments
Please login to add a commentAdd a comment