బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి జిల్లా రైతాంగానికి సాగు నీటి సరఫరా చేసే లక్ష్మి కాలువ హెడ్ రెగ్యులేటర్ వద్ద గేట్లు ఎత్తాలన్నా.. దించాలన్నా తిప్పలు పడాల్సి వస్తోంది. దీంతో లష్కరులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లక్ష్మి కాలువ హెడ్ రెగ్యులేటర్ వద్ద గల రెండు గేట్లకు తలుపులు ఎత్తాలంటే మొదట మాన్యువల్ ఆపరేటింగ్ విధానం ఉండేది. 2017లో ఎలక్ట్రానిక్ విధానంతో గేట్లను అమర్చి మోటార్లను బిగించారు. అయితే విద్యుత్ సరఫరా లేక పోవడంతో ఏడాదిన్నరగా లష్కర్‌లే చేతులతో గేట్లను ఎత్తుతున్నారు. 20 రౌండ్లు హ్యాండిల్ తిప్పితే ఒక్క త్రెడ్ పైకి లేస్తుంది. ఇలా ఒక్కో గేటు కనీసం 200 త్రెడ్‌లు ఎత్తితే గాని నీరు ప్రవహించే అవకాశం లేదని లష్కర్‌లు చెబుతున్నారు. మహిళా ఉద్యోగులకు కూడా తిప్పలు పడాల్సి వస్తోంది. లక్ష్మి కాలువ ద్వారా ప్రస్తుతం 250 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. దానిని కాస్తా పెంచడానికి గురువారం సిబ్బంది గేట్లను ఎత్తితే మొరాయించాయి. చివరికి అతి కష్టం మీద గేట్లను ఎత్తారు.
గతేడాది శివరాత్రి రోజున ముగ్గురు యువకులు లక్ష్మికాలువ హెడ్ రెగ్యులేటర్ సమీపంలోనే ప్రాజెక్ట్‌లో నీట మునిగి చనిపోయారు. ఆ సమయంలో కూడ గేట్లు మొరాయించాయి.
విద్యుత్ కేబుల్‌లో సమస్య..
లక్ష్మి కాలువ హెడ్ రెగ్యులేటర్‌కు సమీపంలోనే లక్ష్మి ఎత్తిపోతల పథకం నిర్మించారు. విద్యుత్ సరఫరా కోసం పక్కనే ఆనకట్ట దిగువన ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి లక్ష్మి హెడ్ రెగ్యులేటర్ వరకు కేబుల్ బిగించారు. అయితే కేబుల్‌లో సమస్య వల్ల విద్యుత్ సరఫరా కాక గేట్లు ఎత్తాలంటే మోటార్లు పనిచేయడం లేదని అధికారులు తెలిపారు. ఏడాదిన్నర కాలంగా ఈ సమస్య నెలకొంది. దీనిపై ఆయకట్టు రైతులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మైనర్ ఇరిగేషన్ డిప్యూటీ ఈఈ సురేశ్ ను సంప్రదించగా లిప్టు మెయింటెనెన్స్‌కు నిధులు మంజూరయ్యాయని, ఆ నిధులతో మోటార్లకు విద్యుత్ సరఫరాలో ఏర్పడిన సమస్యను పరిష్కరిస్తామన్నారు.
మొరాయిస్తున్న లక్ష్మి కాలువ
హెడ్ రెగ్యులేటర్ గేట్లు
ఇబ్బందులు పడుతున్న లష్కర్లు
Comments
Please login to add a commentAdd a comment