విజయవాడలోని ఓ నగల దుకాణంలో కొనుగోలుదారులు
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ధనత్రయోదశి పర్వదినాన్ని పురస్కరించుకొని నగరంలోని బంగారు దుకాణాలు కళకళలాడుతున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం నుంచి ధనత్రయోదశి ఘడియలు ప్రారంభమయ్యాయి. దీంతో నగరంలోని బంగారు ఆభరణాలను విక్రయించే దుకాణాలు పలు ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. శనివారం మధ్యాహ్నం వరకూ త్రయోదశి ఉండటంతో శనివారం భారీగా వ్యాపారం జరగనున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. వినియోగదారులను తమ దుకాణాలకు రప్పించేందుకు వాటి యజమానులు షాపులను సర్వాంగసుందరంగా అలంకరించారు.
ధనత్రయోదశి ప్రత్యేకత ఇది..
దీపావళి పర్వదినానికి ముందు వచ్చే త్రయోదశిని, ధనత్రయోదశిగా ఉత్తరాదిన ధన్‌తేరస్‌గా పిలుస్తారు. ఆ రోజున బంగారాన్ని కొనుగోలు చేస్తే ఆ సంవత్సరమంతా మంచి ఆదాయమంటుందని ప్రజల నమ్మకం. ప్రజల సెంటిమెంట్‌తో దుకాణాలు విభిన్న మోడల్స్, వివిధ ఆఫర్లతో నగరవాసులను రప్పించేందుకు ఆయా దుకాణాలు భారీ ప్రకటనలు ఇచ్చాయి.
విజయవాడలో భారీగా వ్యాపారం
నగరంలోని పలు కార్పొరేట్ దుకాణాల్లో సంవత్సరం మొత్తం జరిగే అమ్మకాల్లో అక్షయతృతీయ, ధనత్రయోదశి రోజుల్లోనే 15 నుంచి 20 శాతం వ్యాపారం జరుగుతుందని వ్యాపారుల అంచనా. దీపావళికి లక్ష్మీపూజ నిర్వహించడం భారతీయుల సంప్రదాయం. దేశంలో దక్షిణాది కన్నా ఉత్తరాదినే ఈ సంప్రదాయం బాగా కనిపిస్తుంది. లక్ష్మీపూజ కొన్ని ప్రాంతాల్లో మూడు రోజుల పాటు చేస్తారు. ఆశ్వీయుజ బహుళ త్రయోదశి నుంచి అమావాస్య రోజు వరకూ ఈ పూజా కార్యక్రమం కొనసాగుతుంది. అందులో భాగంగానే ధన్‌తేరస్ హడావుడి కూడా ఇటీవల మనకు కనిపిస్తుంది. శుక్రవారం సాయంత్రం నుంచి నగరంలోని దుకాణాలు సందడిగా కనిపించాయి.
దశాబ్దకాలంగా విస్తృత ప్రచారం
ధనత్రయోదశి రోజున బంగారం కొనుగోలు చేస్తే మంచి జరుగుతుందని, రానున్న రోజుల్లో చక్కని ఆదాయం ఉంటుందని కొంతమంది నమ్మకం. ఆదాయం వృద్ధి చెందుతుందనే అంశానికి సంబంధించి నిర్ధిష్టమైన పౌరాణికగాధ లేకున్నా ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ అభిప్రాయం బలంగా ఉంది. గడిచిన దశాబ్ద కాలంగా దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా మన రాష్ట్రంలో అక్షయతృతీయ, ధనత్రయోదశి పర్వదినాలను వ్యాపార సంస్థలు బాగా ప్రచారం చేస్తున్నాయి.
ఆకట్టుకుంటున్న ఆఫర్లు
ధనత్రయోదశి సందర్భంగా ఆయా దుకాణాలు ప్రకటించిన ఆఫర్లు వినియోగదారులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వజ్రాభరణాలకు కూడా ప్రత్యేక రాయితీలను ప్రకటించాయి. నగరంలో చాలా దుకాణాలు ఆరు శాతం నుంచి తరుగు లెక్కిస్తామని చెప్పినా వాస్తవంగా పది నుంచి 22 శాతం వరకూ తరుగును లెక్కగడుతుంటాయి. కానీ ప్రస్తుతం ధన్‌తేరస్ సందర్భంగా గ్రాముకు రూ.50 నుంచి రూ.250 వరకూ రాయితీనిస్తున్నాయి. అలాగే కొన్ని దుకాణాలు ఎంత బంగారం కొంటే అంతే బరువు వెండి ఉచితంగా అందిస్తున్నాయి. వినియోగదారులు ఆయా దుకాణాలు ప్రకటిస్తున్న రాయితీలను పరిశీలించి కొనుగోలు చేస్తే మంచి రాయితీని పొందవచ్చని వ్యాపారులు చెబుతున్నారు. అంతేకాకుండా కొన్ని దుకాణాలు మజూరీలో 10 నుంచి 50 శాతం అని రాయితీ ప్రకటించాయి. అలాగే చాలా దుకాణాలు బంగారు నాణెలను అందిస్తున్నట్లు ప్రకటించాయి. శనివారం సైతం నగరంలో ధనత్రయోదశి సందడి కొనసాగనుంది.
Comments
Please login to add a commentAdd a comment