అగ్నిప్రమాదంలో రూ.కోటి ఆస్తినష్టం | Sakshi
Sakshi News home page

అగ్నిప్రమాదంలో రూ.కోటి ఆస్తినష్టం

Published Fri, Apr 19 2024 1:25 AM

మంటలను ఆర్పుతున్న ఫైర్‌ సిబ్బంది - Sakshi

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): విజయవాడ బందరు రోడ్డులోని ఠాగూర్‌ గ్రంథాలయం ఎదురుగా ఉన్న జనరిక్‌ మందుల గోడౌన్‌, వస్త్రాల గోడౌన్‌లో గురువారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో రూ. కోటి వరకు ఆస్తినష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా. సేకరించిన వివరాల మేరకు.. బందరు రోడ్డులోని ఠాగూర్‌ గ్రంథాలయం ఎదురుగా ఉన్న జీప్లస్‌2 కమర్షియల్‌ బిల్డింగ్‌ ఫస్ట్‌ ఫ్లోర్‌లో ఆఫీసు, జనరిక్‌ మందుల గోడౌన్‌, సెకండ్‌ ఫ్లోర్‌లో వస్త్రాల గోడౌన్‌ నిర్వహిస్తున్నారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో దుకాణాలు ఉన్నాయి. మధ్యాహ్నం సమయంలో బిల్డింగ్‌ టెర్రస్‌పై నున్న వర్కర్లు మెట్ల మార్గం గుండా కిందికి వస్తూ కిటికీల్లోంచి దట్టమైన పొగ వస్తుంటాన్ని గమనించి, దీంతో వెంటనే ఫైర్‌ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఫైర్‌ సిబ్బంది హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకున్నారు. నగరంలోని ఎనిమిది అగ్నిమాపక వాహనాలను రప్పించి మంటలను అదుపుచేశారు. మంటలు పక్క భవనాలకు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. ప్రమాదంలో రూ.కోటి వరకు నష్టం వాట్లిల్లి ఉండొచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మధ్యాహ్నం సమయంలో కరెంట్‌ పోయిందని ఆ సమయంలో మంటలు వ్యాపించినట్లు గుర్తించామని స్థానికులు చెబుతున్నారు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ప్రమాదం జరిగిందా? మరే ఇతర కారణాలు ఉన్నాయా? అన్న కోణంలో దర్యాప్తు సాగుతోందని, పూర్తి స్థాయిలో ఆస్తినష్టం అంచనా వేస్తున్నట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement