ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు | Sakshi
Sakshi News home page

ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు

Published Tue, May 7 2024 10:35 AM

ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు

ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఢిల్లీరావు

నందిగామ: సార్వత్రిక ఎన్నికలు అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్టు ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌.ఢిల్లీరావు తెలిపారు. నందిగామ పట్టణంలోని కేవీఆర్‌ కళాశాలలో పీఓ, ఏపీఓలకు రెండవ విడత జరుగుతున్న శిక్షణ తరగతులను, పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా జరుగుతున్న పోలింగ్‌ ప్రక్రియలను సోమవారం ఆయన పరిశీలించారు. ముందుగా పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం పీవో, ఏపీవోలకు కొద్దిసేపు కలెక్టర్‌ స్వయంగా శిక్షణ తరగతులు నిర్వహించి పలు సూచనలు చేశారు. అనంతరం మాట్లాడుతూ ఈనెల 7, 9 తేదీలలో ప్రత్యేక బృందాల ద్వారా హోమ్‌ ఓటింగ్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలో సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. ముఖ్యంగా నిబంధనలు ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. జిల్లాలో అన్నిచోట్ల పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతోందన్నారు. జిల్లాలో దాదాపు 18 వేల వరకు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు పోలయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. జిల్లాలో 1,052 మంది హోమ్‌ ఓటింగ్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు దరఖాస్తులు చేసుకున్నట్లు తెలిపారు. ఆయన వెంట నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఎ.రవీంద్రరావు, పలువురు అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement