ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేల తనయుల హడావుడి | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేల తనయుల హడావుడి

Published Sat, Oct 26 2024 2:31 AM | Last Updated on Sat, Oct 26 2024 2:31 AM

ప్రభు

ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేల తనయుల హడావుడి

వారు పేరుకు మాత్రమే ఎమ్మెల్యేలు. కానీ నియోజకవర్గాల్లో పెత్తనం మాత్రం వారిపుత్రులదే. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల కుమారులకు పార్టీలో పదవి, అధికార హోదా లేకపోయినా హడావుడి మాత్రం చేస్తున్నారు. శంకుస్థాపనలు, సమీక్ష సమావేశాలు, మద్యం, ఇసుక ఇలా ఒకటేంటి అన్ని వ్యవహారాలు వారి కనుసన్నల్లోనే నడుస్తున్నాయి. ఎవరైనా వీరిని కలవాల్సిందే. ఎమ్మెల్యేలు కూడా వారి వారసులు చెప్పిన వాటికే ప్రాధాన్యమిస్తుండటంతో స్థానిక నేతలు కూడా వారి తనయులకే జై కొడుతున్నారు. ప్రొటోకాల్‌ నిబంధనలు తుంగలో తొక్కుతున్నా పట్టించుకున్న వారే లేరు.
● శంకుస్థాపనలు సైతం చేస్తున్న వైనం ● అధికారులంతా వీరి కనుసన్నల్లోనే ● అవనిగడ్డ, పెనమలూరు, విజయవాడ సెంట్రల్‌, తూర్పులో వీరిదే ఆధిపత్యం

సాక్షి ప్రతినిధి, విజయవాడ: దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే చందాన కూటమి ఎమ్మెల్యేల తీరుంది. అధికారంలోకి వచ్చీ రావడంతో ఉమ్మడి కృష్ణాలో కొందరు ఎమ్మెల్యేలు వారి వారసులకు నియోజకవర్గ పెత్తనం అప్పచెబుతున్నారు.

అధికారిక కార్యక్రమాల్లో అన్నింటిలో వారి హవానే కనపడుతోంది. ప్రభుత్వ కార్యాలయాల విజిట్‌తోపాటు కీలకమైన పోలీసు, రెవెన్యూ వ్యవహారాలు చూస్తున్నారు. వీరి జన్మదిన వేడుకలకు అధికారులు హాజరై శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మద్యం, ఇసుక వంటి కీలక వ్యవహారాలు వీరి కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. నియోజక వర్గంలోని కూటమి నేతలంతా, గ్రామ, వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి వీరిని కలవాల్సిందే. ఈ మేరకు అధికారులకు సైతం ఎమ్మెల్యేలు తమ తనయులు చెప్పినట్లు చేయాలని సంకేతాలు ఇచ్చారు.

అవనిగడ్డలో ఆయనదే హవా

అవనిగడ్డ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌ తనయుడు వెంకట్రామ్‌దే పెత్తనం అంతా. పార్టీలో ఎలాంటి పదవి, అధికారిక పదవి లేకపోయినా ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌ కంటే ఎక్కువగా ప్రభుత్వ కార్యక్రమాల్లో తనయుడే పాల్గొంటారు. అధికారులకు దిశా నిర్దేశం చేస్తారు. అధికార సిబ్బంది బదిలీలు, స్టేషన్‌ వ్యవహారాలన్నీ ఆయనే చూసుకుంటారు. ఇసుక, మద్యం వ్యవహారాలు ఆయన కనుసన్నల్లోనే జరుగుతాయనే విమర్శలున్నాయి. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులే పాల్గొనాల్సి ఉంది. ప్రజాప్రతినిధి కాకపోయినా, పార్టీలో పదవి లేకపోయినా ఆయనే కింగ్‌మేకర్‌. పోలీసు, రెవెన్యూ ఇతర శాఖల పర్యవేక్షణ ఆయనదే. అవసరమైతే ఆదేశాలిస్తున్నారు. పోలీసులు సైతం జీహుజూర్‌ అంటున్నారు.

పెనమలూరును చుట్టేస్తూ..

పెనమలూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ తనయుడు వెంకటరామ్‌ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. నియోజకవర్గంలోని వ్యవహారాలను ఆయనే చూసుకొంటున్నారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు, శంకుస్థాపనల్లో పాల్గొంటున్నారు. గ్రామాల్లో టీడీపీ నేతలు, యువతను కలిసి తన మార్కు రాజకీయాలకు శ్రీకారం చుడుతున్నారు. ఎమ్మెల్యే సైతం తన వారసుడిని ప్రమోట్‌ చేసేలా అధికారులకు నేతలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. ఇసుక, మద్యం వ్యవహారాలను చక్కబెట్టడంలో తండ్రికి తనయుడు చేదోడు వాదోడుగా ఉంటున్నారని తెలుస్తోంది. పల్లె పండుగ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇటీవల పునాదిపాడులో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ప్రొటోకాల్‌ నిబంధనలనే మర్చిపోతున్నారు.

‘సెంట్రల్‌’లో..

విజయవాడ సెంట్రల్‌ నియోజక వర్గంలో బొండా ఉమ తనయుల్లో పెద్ద కుమారుడు విదేశాల్లో ఉంటున్నారు. చిన్నకుమారుడు రవితేజ నియోజక వర్గంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల సమయంలో తనదైన పాత్ర పోషించారు. ప్రస్తుతం తెరచాటుగా నియోజకవర్గ వ్యహారాలను ఆయనే నడుపుతున్నారు. ఎన్నికల్లో తమకు వ్యతిరేకంగా పనిచేసినవారిని తనదైన శైలిలో దారిలోకి తెచ్చుకున్నారు. ఎమ్మెల్యే సైతం తనయుడిని ప్రమోట్‌ చేస్తుండటంతో, అధికారులు ఆయన మాటకు ప్రాధాన్యమిస్తున్నారు. నియోజక వర్గంలో తండ్రికి, సమానంగా ఫ్లెక్సీల్లో తనయుల ఫొటోలను కార్య కర్తలు ఏర్పాటు చేస్తున్నారు. భవిష్యత్తు రాజకీయాలు తనయులవే అనే సంకేతాలు ఎమ్మెల్యే క్యాడర్‌, అధికారులకు ఇప్పటికే ఇచ్చారు. నియోజక వర్గాల్లో పేరుకు ఎమ్మెల్యేలైనా, పెత్తనం మాత్రం తనయులే చేస్తున్నారు. దీంతో పాటు పలు నియోజక వర్గాలో సైతం ఎమ్మెల్యేల బావమరదులు, తమ్ముళ్లు, ముఖ్య అనుచరులే వెలగబెడుతున్నారు. అనధికారికంగా వీరే ఎమ్మెల్యేలుగా చలామణి అవుతున్నారు.

విజయవాడ తూర్పు నియోజక వర్గంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు తన కుమారుడు క్రాంతిని ప్రమోట్‌ చేస్తున్నారు. నియోజకవర్గంలోని పార్టీ కార్యక్రమాల్లోఅతని తనయుడు పాల్గొంటున్నారు. ఎమ్మెల్యే సైతం కలెక్టర్‌, కమిషనర్‌ వంటి ఉన్నతాధికారులకు తన కుమారుడు ప్రతిపాదించిన పనులు చేయాలని సూచించారు. పార్టీ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే బదులుగా పాల్గొంటున్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలకు ఆయన పరిచయం చేస్తూ, తనయుడే కార్యక్రమాలు చూస్తారనే సంకేతాలు ఇప్పటికే పంపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేల తనయుల హడావుడి 1
1/2

ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేల తనయుల హడావుడి

ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేల తనయుల హడావుడి 2
2/2

ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేల తనయుల హడావుడి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement