పడకేసిన పల్లె వైద్యం | - | Sakshi
Sakshi News home page

పడకేసిన పల్లె వైద్యం

Published Sat, Oct 26 2024 2:31 AM | Last Updated on Sat, Oct 26 2024 2:31 AM

పడకేస

పడకేసిన పల్లె వైద్యం

లబ్బీపేట(విజయవాడతూర్పు): పల్లె వైద్య పడకేస్తుంది. వైద్య సేవలకు పల్లెవాసులు క్రమేణా దూరమవుతున్నారు. వ్యాధులొస్తే పట్టణాలకు పరుగు తీయాల్సి వస్తోంది. దీర్ఘకాలిక వ్యాధులకు సైతం స్క్రీనింగ్‌ లేక, సకాలంలో మందులు అందక ఇబ్బంది పడుతున్నారు. గత ప్రభుత్వం గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడానికి ‘ఫ్యామిలీ డాక్టర్‌’ను ప్రవేశపెట్టి, ప్రజల చెంతకే వైద్య సేవలు తీసుకెళ్లింది. జగనన్న ఆరోగ్య సురక్ష పేరుతో స్పెషలిస్టు వైద్యులను గ్రామాలకు పంపి, ప్రతి సచివాలయం పరిధిలో వైద్య శిబిరాలు నిర్వహించింది. ఇప్పుడు అలాంటి కార్యక్రమాలన్నీ కనుమరుగయ్యాయి. ఈ ఏడాది సీజనల్‌ వ్యాధులైన డయేరియా, విష జ్వరాల బారిన పడి పలువురు మృత్యువాత పడ్డారు. అయినా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదు.

ఫ్యామిలీ డాక్టర్‌ ఏదీ!

ఒకప్పుడు ‘ఫ్యామిలీ డాక్టర్‌’ ద్వారా 15 రోజులకు ఒకసారి గ్రామాలను సందర్శించి బీపీ, షుగర్‌, హైపో థైరాయిడ్‌ రోగులకు మందులు అందించేవారు. వారికి పరీక్షలు కూడా చేసేవారు. ప్రతి గ్రామానికి షెడ్యూల్‌ ప్రకారం టీమ్‌ వెళ్లేలా వైద్యులు, సిబ్బందిని మ్యాపింగ్‌ చేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. డయేరియా, విష జ్వరాలు, వరదలు, ఆ తర్వాత వైద్యుల సమ్మె ఇలా ఐదు నెలలుగా కుటుంబ డాక్టర్‌ కార్యక్రమం పక్కదారి పట్టింది.

వ్యాధుల స్క్రీనింగ్‌ ఎక్కడ?

జగనన్న ఆరోగ్య సురక్ష పేరుతో గత ప్రభుత్వం గ్రామాలకే స్పెషలిస్టు వైద్యులను పంపి శిబిరాలు నిర్వహించింది. ఆయా శిబిరాలకు వచ్చిన రోగులకు స్క్రీనింగ్‌ చేసి క్యాన్సర్‌ వంటి వ్యాధుల బారినపడిన వారిని తొలిదశలో గుర్తించేవారు. షుగర్‌ వచ్చే లక్షణాలు ఉన్న వారిని సైతం హెచ్చరించి అప్రమత్తంగా ఉండాలని సూచించేవారు. షుగర్‌, బీపీలతో ఉన్న వారికి ఈసీజీ వంటి పరీక్షలు చేసి, అవసరమైతే పెద్దాస్పత్రికి పంపి ఎకో పరీక్షలు చేసేవారు. ఇప్పుడు అవన్నీ పోయాయి. వ్యాధుల స్క్రీనింగ్‌ అటకెక్కింది.

నిలిచిన ఆరోగ్య కార్యక్రమాలు వైద్యం అందక ప్రజల ఇబ్బందులు గత ప్రభుత్వ మంచి కార్యక్రమాలు నిర్వీర్యం చేయడమే లక్ష్యం

స్పెషలిస్టు వైద్యుల జాడేది?

జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా గత ప్రభుత్వం స్పెషలిస్టు వైద్యులను గ్రామాలకు పంపి వైద్యం అందించేది. నేడు స్పెషలిస్టు వైద్యులతో పరీక్షలు చేయించుకోవాలంటే విజయవాడ వెళ్లాల్సి వస్తోంది. దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్న రోగులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. అక్కడ ఏ రోజు ఏ వైద్యుడు ఉంటాడో కూడా తెలియడం లేదు.

–మేడంద్రాపు కుటుంబరావు,

కంకిపాడు, కృష్ణాజిల్లా

నిర్ధారణ పరీక్షకు ఇబ్బందులు

గతంలో కుటుంబ డాక్టర్‌, ఆరోగ్య సురక్షతో గ్రామాలకే వైద్యులు వచ్చి పరీక్షలు చేసేవారు. ఇక్కడే మందులు ఇచ్చేవారు. అవసరమైతే పెద్దాస్పత్రికి వాళ్లే పంపేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. గ్రామాలకు స్పెషలిస్టు వైద్యులు రావడం లేదు. పేదలే పెద్దాస్పత్రిలకు పరుగులు తీయాల్సి వస్తుంది. సమయంతో పాటు, డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తోంది.

–జె.రంగారెడ్డి, నున్న, విజయవాడరూరల్‌

నియంత్రణ చర్యలు శూన్యం..

ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది సీజనల్‌ వ్యాధులు విజృంభించాయి. డయేరియా, విష జ్వరాలు, మలేరియా డెంగీ వంటి వ్యాధులు సోకి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన వైద్య ఆరోగ్య, మున్సిపల్‌, పంచాయతీరాజ్‌ శాఖలు చోద్యం చూశాయి. కలుషిత నీరు తాగి ప్రజలు డయేరియా బారిన పడ్డారు. విజయవాడ, జగ్గయ్యపేట వంటి ప్రాంతాల్లో మరణాలు కూడా సంభవించాయి. అయినా కూటమి పాలకులు గత ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తోందని విమర్శలు వస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
పడకేసిన పల్లె వైద్యం1
1/2

పడకేసిన పల్లె వైద్యం

పడకేసిన పల్లె వైద్యం2
2/2

పడకేసిన పల్లె వైద్యం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement