మిగిలిపోయాయ్‌! | - | Sakshi
Sakshi News home page

మిగిలిపోయాయ్‌!

Published Sat, Oct 26 2024 2:32 AM | Last Updated on Sat, Oct 26 2024 2:31 AM

మిగిలిపోయాయ్‌!

మిగిలిపోయాయ్‌!

● భర్తీకాని నాలుగువేల ఇంజినీరింగ్‌ సీట్లు ● కంప్యూటర్‌ కోర్సుల్లో 95 శాతం సీట్ల భర్తీ ● మెకానికల్‌ సగం, సివిల్‌ 40 శాతం ఖాళీ ● సీట్ల భర్తీపై ఫీజుల పెంపు ప్రభావం

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): చదువంటే ఇంజినీరింగే అని కొన్నేళ్లుగా వినిపిస్తున్న మాట. అయితే ఈ ఏడాది ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇంజినీరింగ్‌ సీట్లు 20 శాతానికి పైగా మిగిలిపోయాయి. రాష్ట్రంలోనే విద్యాకేంద్రంగా ఉన్న ఉమ్మడి కృష్ణాలో సీట్లు మిగిలిపోవడం విస్మయానికి గురి చేస్తోంది. ఒకటి కాదు రెండు కాదు మూడుసార్లు ఉన్నత విద్యా మండలి కౌన్సిలింగ్‌ నిర్వహించినా పెద్ద సంఖ్యలో ఇంజినీరింగ్‌ సీట్లు మిగిలిపోయాయి. ప్రభుత్వం ఇటీవల ఇంజినీరింగ్‌ కళాశాలల ఫీజులను పెంచడంతో పాటు సంప్రదాయ కోర్సులకు డిమాండ్‌ తగ్గటం వంటి కారణాలతో సీట్లు మిగిలిపోయాయని వాదనలు వినిపిస్తున్నాయి. ఓపెన్‌ అలాట్‌మెంట్‌ పేరుతో కొన్ని సీట్లు భర్తీ చేసుకున్నా చాలా కళాశాలల్లో భర్తీ కాకపోవడంతో యాజమాన్యాలు తలలు పట్టుకుంటున్నాయి.

ఉమ్మడి జిల్లాలో మిగిలిపోయిన 4,329 సీట్లు

ఉమ్మడి కృష్ణాజిల్లాలో సుమారు 30 ఇంజినీరింగ్‌ విద్యాసంస్థలు కొనసాగుతున్నాయి. అందులో రెండు విశ్వవిద్యాలయాలు కాగా 28 కళాశాలలుగా ఉన్నాయి. వాటిల్లో చేరడానికి ఈ నెల మొదటి వారం వరకూ అవకాశం కల్పించారు. ఉమ్మడి జిల్లాలో కన్వీనర్‌ కోటాలో 14,670 సీట్లు ఉండగా అందులో 11,481 సీట్లు మాత్రమే నిండాయి. అందులో సుమారు 3,189 సీట్లు మిగిలిపోయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అదేవిధంగా 6,330 మేనేజ్‌మెంట్‌ సీట్లు ఉండగా అందులో ఈ నెల మొదటి వారానికి 5,190 సీట్లు భర్తీ అయ్యాయి. దీనిలో 1,140 సీట్లు మిగిలిపోయాయి. కన్వీనర్‌, మేనేజ్‌మెంట్‌ కోటా రెండూ కలిపి సుమారుగా 4,329 సీట్లు మిగిలిపోయినట్లు అధికారులు చెబుతున్నారు.

కంప్యూటర్‌ కోర్సుల్లో..

ఇంజినీరింగ్‌ కళాశాలల్లో భర్తీ అయిన సీట్లలో అధిక శాతం కంప్యూటర్స్‌ రంగం, దాని అనుబంధ రంగాల కోర్సులకు చెందినవే ఉన్నాయి. ప్రధానంగా కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ కోర్సులకు ఇటీవల డిమాండ్‌ ఉన్న విషయం తెలిసిందే. వీటిలో 95 శాతం భర్తీ అయ్యాయి. ఐటీ రంగంలో పలు కోర్సులకు సైతం ఇటీవల డిమాండ్‌ పెరిగింది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మిషన్‌ లెర్నింగ్‌ వంటి రంగాలకు చెందిన కోర్సులకు సైతం డిమాడ్‌ పెరగడంతో 97 శాతానికి పైగా ఆయా సీట్లు భర్తీ అయినట్లు తెలిసింది. చాలా కాలేజీల్లో ఈ రంగానికి చెందిన సీట్లే ఎక్కువగా ఉండటంతో వాటిపైనే దృష్టి పెట్టి యాజమాన్యాలు భర్తీ చేసుకున్నాయి.

ఫీజుల పెంపు ప్రభావం

డిమాండ్‌ తగ్గిన మెకానికల్‌

ఇంజినీరింగ్‌లో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన బ్రాంచ్‌ మెకానికల్‌, సివిల్‌ ఇంజినీరింగ్‌ కోర్సులు. కానీ వాటికి నేడు డిమాండ్‌ తగ్గింది. మెకానికల్‌ బ్రాంచ్‌కు అయితే కేవలం 49 శాతం సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. అదే సివిల్‌ కోర్సులకు మాత్రం సగానికి దాటి విద్యార్థులు చేరారు. వీటికి ఆదరణ తగ్గుతుండటంతో భవిష్యత్తులో ఆయా రంగాలకు కొరత ఏర్పడే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇంజినీరింగ్‌ సీట్ల భర్తీపై ఫీజుల పెంపు ప్రభావం పడిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఇంజినీరింగ్‌ కోర్సుల ఫీజులను పెంచిన విషయం తెలిసిందే. గతేడాది ఇంజనీరింగ్‌ కోర్సుల కనీస ఫీజు 35 వేలు కాగా గరిష్టంగా రూ.70 వేల వరకూ ఉండేది. ఈ ఏడాది గరిష్టంగా 1,05,000కు పెరిగింది. మేనేజమెంట్‌ కోటా సీట్లకు సాధారణ ఫీజు మూడు రెట్లు వసూలు చేసుకోవడానికి అవకాశం ఉంది. దానికి తోడు యజమాన్యాలు హద్దు లేకుండా మేనేజ్‌మెంట్‌ సీట్ల ధరలను పెంచేసి వసూళ్లకు పాల్పడింది. దాంతో సీట్ల భర్తీపై ఫీజుల ప్రభావం పడిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement