అధైర్యపడొద్దు..అండగా ఉంటాం
వైఎస్సార్‌సీపీ ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్ దేవినేని అవినాష్
కంచికచర్ల: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేసి కేసులు పెడుతున్నారని, ఇందుకు రానున్నకాలంలో తగినమూల్యం చెల్లించుకోక తప్పదని ఆపార్టీ ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్ దేవినేని అవినాష్, నందిగామ మాజీఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్‌మోహనరావు హెచ్చరించారు. ఇటీవల గణేష్ నిమజ్జనం సందర్భంగా టీడీపీ నాయకులు దాడిచేయడంతోపాటు తిరిగి కేసులు పెట్టడంతో జైలుపాలై బెయిల్‌పై విడుదలైన వైఎస్సార్‌సీపీ నాయకులు పరిటాల రాము, వీరభద్రరావు తదితరులను బుధవారం వారు పరామర్శించారు. అధైర్యపడవద్దని..అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈసందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చి నాలుగున్నర నెలలైనా ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చలేదని విమర్శించారు. గ్రామాల అభివృద్ధికి కృషిచేయకుండా, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేసి తిరిగి పోలీసులతో కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారని మండిపడ్డారు. ఇది సరైన పద్ధతి కాదని హితవు పలికారు. కంచికచర్ల, నందిగామ ప్రాంతాల్లో రీచ్‌లను దక్కించుకున్న కూటమి నాయకులు భారీగా ఇసుకను దోపిడీ చేస్తున్నారన్నారు. స్టాక్‌యార్డుల్లోని లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను దోచుకుని ప్రభుత్వ ఖజానాకు రూ.కోట్లలో నష్టం చేశారన్నారు. మద్యం బెల్ట్‌షాపుల ఏర్పాటుతో అధికధరలకు మద్యాన్ని విక్రయిస్తూ ప్రజలను దోచుకుంటున్నారన్నారు. రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు చేసిందేమి లేదని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను పరామర్శించిన వారిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ అభ్యర్థి పూనూరు గౌతంరెడ్డి, మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ నల్లగట్ల సుధారాణి, మాజీఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్, వైస్ ఎంపీపీ బండి మల్లికార్జునరావు,బీసీ సంఘ నాయకులు అంగడాల పూర్ణచంద్రరావు, రాయల నరసింహారావు, బి.సుబ్బారావు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment