గన్నవరం: తన మాట లెక్కచేయడం లేదనే అక్కసుతో ఓ టీడీపీ నేత, మండల తహసీల్దార్‌ను ఏసీబీ ట్రాప్ పేరుతో భయపెట్టే ప్రయత్నం చేశాడు. అందులో భాగంగా తనమనిషికి డబ్బులు ఇచ్చి తహసీల్దార్ వద్దకు పంపించాడు. తీరా తహసీల్దార్ డబ్బులు తీసుకునేందుకు తిరస్కరించడంతోపాటు ఎవరూ పంపించారని గట్టిగా నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. దీంతో కథ అడ్డం తిరిగిందని తెలుసుకున్న సదరు టీడీపీ నేత అఘమేఘాల మీద తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని దిద్దుబాటు యత్నాలు చేయడం గమనార్హం. గన్నవరం తహసీల్దార్ కార్యాలయంలో నాటకీయ పరిణామాల మధ్య జరిగిన ఈ సంఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే...అధికార పార్టీకి మండల బాధ్యుడిగా ఉన్న నేత తాను చెప్పినట్లుగా నడుచుకోవడం లేదని ఉద్దేశంతో తహసీల్దార్ టార్గెట్ చేశాడు. తహసీల్దార్ భయపెట్టి అయినా దారిలోకి తెచ్చుకోవాలని పక్కా స్కెచ్ వేశాడు. తహసీల్దార్ ఏసీపీ ట్రాప్ పేరుతో బెదిరించేందుకు ప్లాన్ చేసి తనకు సన్నిహితుడైన ఓవ్యక్తికి రూ. 20 వేలు నగదు ఇచ్చి మంగళవారం సాయంత్రం తహసీల్దార్ ఆఫీస్‌కు పంపించాడు. సదరు వ్యక్తి పత్రాల మధ్య పెట్టిన నగదును తహసీల్దార్ ముందు ఉన్న టేబుల్‌పై పెట్టాడు. దీంతో అవాక్కయిన తహసీల్దార్ ఆతనిని గట్టిగా ప్రశ్నించడంతో మొదట పొంతన లేని సమాధానాలు చెప్పాడు. అప్రమత్తమైన తహసీల్దార్ పోలీసులను పిలిపించడంతో మండల పార్టీ బాధ్యులు పంపించారని సమాధానం ఇచ్చారు. దీంతో తహసీల్దార్ నేరుగా సదరు నేతకు ఫోన్ చేయడంతో నిమిషాల వ్యవధిలోనే ఆయన అక్కడికి చేరుకున్నాడు. వేరే అధికారికి పంపించిన డబ్బును పొరపాటున మీకు ఇచ్చినట్లుగా తహసీల్దార్‌కు సర్దిజెప్పుకున్నాడు. పత్రాల మధ్య పెట్టిన డబ్బుతోపాటు ఆతను పంపించిన వ్యక్తిని వెంట తీసుకుని చిటికెలో పెద్దచిక్కే తప్పించావయ్యా ‘వెంకటేశా’ అంటూ అక్కడ్నుంచి మెల్లగా జారుకున్నాడు. ఈసంఘటన రెవెన్యూ వర్గాల్లో కలకలం సృష్టించింది.
Comments
Please login to add a commentAdd a comment