పందేలకు ‘బరి’తెగించి ఏర్పాట్లు
తెలుగింటి పెద్ద పండుగ సంక్రాంతికి సర్వం సిద్ధమైంది. సంబరాల ముసుగులో జూద క్రీడలు విచ్చలవిడిగా నిర్వహించేందుకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో కోడి పందేల కోసం బరులు ముస్తాబవుతున్నాయి. టీడీపీ ప్రజాప్రతినిధులే భారీగా కమీషన్లు తీసుకుంటూ ‘కోట్లాట’కు సహకరిస్తున్నారని సమాచారం.
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో జూదాలు, కోడిపందేల వంటి వాటిపై నిషేధం ఉన్నా.. సంక్రాంత్రి సంబరాల పేరుతో పెద్ద సంఖ్యలో హైటెక్ జూదానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సువిశాల ప్రాంగణాల్లో సకల హంగులతో బరులను తీర్చి దిద్దుతున్నారు. వీవీఐపీలకు ప్రత్యేకంగా ఏసీ, కూలర్లు, ఎల్‌ఈడీ స్కీన్ల వంటి సదుపాయాలు కల్పిస్తున్నారు. క్యాసినో, పేకాట, గుండాట వంటి పలు రకాల జూద క్రీడలు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో నియోజకవర్గంలో సరాసరిన పదికి పైగా బరులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. బరి స్థాయిని బట్టి రూ.30లక్షలు నుంచి రూ. 2కోట్ల వరకు టీడీపీ ప్రజా ప్రతినిధులకు డబ్బులు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారని సమాచారం. గన్నవరం నియోజకవర్గం అంపాపురంలో బరి ఏర్పాటు చేసుకోవాలంటే నియోజకవర్గ ప్రజా ప్రతినిధికి రెండుకోట్లు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. గత 30 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా విజయవాడతోపాటు పరిసర ప్రాంతాలు రామవరప్పాడు, ఎనికేపాడు ప్రాంతాల్లో సంక్రాంతి సంబరాల పేరుతో బరులు ఏర్పాటు చేస్తున్నారు.
కొరవడిన పర్యవేక్షణ..
కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకొంటామని అధికారులు చెబుతున్నా.. ఆ దిశగా ఎలాంటి చర్యలు కనిపించటం లేదు. పేపరు ప్రకటనలు తప్ప ఆ దిశగా చర్యలు తీసుకోవటం లేదు. పోలీసు ఉన్నతాధికారులకు సైతం ముడుపులు ముడుతుండటంతో బరుల వైపు కన్నెత్తి చూడరనే భావన నెలకొంది.
బాపులపాడు మండలం అంపాపురంలో సిద్ధమవుతున్న కోడి పందేల బరి
ఉమ్మడి కృష్ణా జిల్లాలో భారీగా కోడి పందేల బరులు బేరం పెట్టి రేటు నిర్ణయించినకూటమి నేతలు రూ.30 లక్షల నుంచిరూ.కోటి వరకు వసూలు పలు హైటెక్ జూద క్రీడలకూ ఏర్పాట్లు ఏరులై పారనున్న డబ్బు, మద్యం
ఈ గ్రామాల్లో భారీ ఏర్పాట్లు..
పట్టించుకోని అధికారులు
పుంజులు సై..
పందేల బరిలో తగ్గేదేలే అన్నట్లు కోడిపుంజులు సై అంటూ సిద్ధం అయ్యాయి. గతంలో మాదిరి కాకుండా ఇప్పటికే బహిరంగానే మద్యం, పేకాట శిబిరాలకు ప్రభుత్వం డోర్లు తెరిచింది. ఆ జోష్‌తో పెద్ద ఎత్తున ఈ ఏడాది కోడి పందేలు, క్యాసినో, గుండాట, పేకాట, మద్యం దుకాణాలు, వ్యాపార సముదాయాలు ఏర్పాటు చేసేందుకు ఆశావాహులు పోటీ పడుతున్నారు. సరదాగా సొంత ఊర్లకు పండుగకు వచ్చే వారి జేబులు ఖాళీ అయ్యే అవకాశాలున్నాయి. సాంకేతికతను ఉపయోగించి ఎంట్రీ ఫీజు రూ.5వేలుగా నిర్ణయించి, పెద్ద ఎత్తున అన్ని హంగులతో బరులను ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రచించారు. నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని, ప్రజా ప్రతినిధులు భరోసా ఇచ్చి, వారి నుంచి కోట్ల రూపాయలు దండుకొనేలా స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. పందెం రాయుళ్లను ఆకర్షించేందుకు ముందుగానే పందెం ఒప్పందాలు, కోతముక్కకు వచ్చే జూదరులకు హోటల్ రూమ్స్ బుకింగ్ జరుగుతున్నాయి.
మైలవరం నియోజకవర్గంలో కోడిపందేల నిర్వహణ కోసం ఒక్కొక్క బరికి రూ.10లక్షల నుంచి రూ.20లక్షల వరకు నిర్వాహకులు వెచ్చిస్తున్నారు. మైలవరం మండల పరిధిలో మొర్సుమల్లి, చండ్రగూడెం, పొందుగల, మైలవరం, వెల్వడం, కీర్తిరాయినిగూడెం, గణపవరం.. జి.కొండూరు మండలంలో గంగినేని, మునగపాడు, జి.కొండూరు, కట్టుబడిపాలెం, కవులూరు, కుంటముక్కల, కోడూరు, వెల్లటూరు, ఇబ్రహీంపట్నం మండలంలో ఇబ్రహీంపట్నం, కొండపల్లి, మూలపాడు, చిలుకూరు, తుమ్మలపాలెం, జూపూడి చిన్నలంక, విజయవాడరూరల్ మండలంలో కొత్తూరు తాడేపల్లి, జక్కంపూడి పాముల కాల్వ, రెడ్డిగూడెం మండలంలో రంగాపురం, రెడ్డిగూడెం, కుదప, కొత్తనాగులూరు గ్రామాలలో బరులు సిద్ధమవుతున్నాయి
గన్నవరం నియోజకవర్గంలోని బాపులపాడు మండలం అంపాపురం, కె.సీతారామపురం, ఉంగుటూరు మండలం నందమూరు, గన్నవరం మండలం సూరంపల్లి, విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడు, రామవరప్పాడు, అంబాపురం గ్రామాల్లో సంక్రాంతి బరులు సిద్ధం చేస్తున్నారు. బాపులపాడు మండలం అంపాపురం గ్రామంలో క్యాసినో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నట్లు సమాచారం.
పెనమలూరు నియోజకవర్గంలోని పెనమలూరు మండలం యనమలకుదురు, పెదపులిపాక, పోరంకి గ్రామాల్లో బరులు రెడీ చేస్తున్నారు. కంకిపాడు మండలం ఈడుపుగల్లు, ఉప్పలూరు, గొడవర్రు, కంకిపాడులోని రెండు ప్రాంతాల్లో బరులు రెడీ అయ్యాయి. భారీ సెట్టింగులతో బరులు సిద్ధమయ్యాయి. ఉయ్యూరు మండలం ఆకునూరు, గండిగుంట, కాటూరు, బోళ్లపాడు గ్రామంలో రెండు చోట్ల బరులు సిద్ధమవుతున్నాయి. ఆకునూరులో ప్రభుత్వ పాఠశాల, జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో బరి ఏర్పాటు చేసే పనులు జరుగుతున్నాయి.
నగర సంస్కృతికి భిన్నంగా విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడు పరిధిలోని 16 ఎకరాల్లో సంక్రాంతి బరిని సిద్ధం చేస్తున్నారు. భారీ సెట్టింగులు, ఏసీలు, కూలర్లు, ప్రత్యేక గ్యాలరీలు, స్క్రీన్‌లు ఏర్పాటు చేస్తున్నారు. అంబాపురంలో విజయవాడ సెంట్రల్ నియోజక వర్గ ప్రజా ప్రతినిధి ఆధ్వర్యంలో బరులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment