వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిత్వం దోహదం
జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణసారిక
విజయవాడస్పోర్ట్స్: అనేక వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిత్వం దోహదం చేస్తుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ అరుణసారిక సూచించారు. విజయవాడ సివిల్ కోర్టుల ప్రాంగణంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యాన ఈ నెల ఆరో తేదీన ప్రారంభమైన 40 గంటల మీడియేషన్ శిక్షణ కార్యక్రమం శుక్రవారం ముగిసింది. నిపుణులైన బీనాదేవరాజ్(బెంగళూరు), సురేందర్‌సింగ్(ఢిల్లీ)లచే జిల్లాలోని 24 మంది న్యాయ అధికారులకు శిక్షణ ఇచ్చారు. ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న న్యాయమూర్తి అరుణసారిక మాట్లాడుతూ కక్షిదారుల మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించేందుకు మధ్యవర్తిత్వం సహాయపడుతుందన్నారు. మధ్యవర్తిత్వం చేసే వ్యక్తులు తటస్థంగా ఉంటూ, స్వచ్ఛంద భాగస్వామ్యం, సహ విశ్వసనీయత కలిగి ఉండాలన్నారు. అనంతరం శిక్షణ తీసుకున్న న్యాయ అధికారులకు సర్టిఫికెట్‌లను అందజేశారు. కార్యక్రమంలో విజయవాడ రెండో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి, మండల లీగల్ సెల్ అథారిటీ చైర్మన్ ఎ.సత్యానందం, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కేవీ రామకృష్ణయ్య పాల్గొన్నారు.
నేటి నుంచి ఆరుద్రోత్సవాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలోని నటరాజ స్వామి వారి ఆరుద్రోత్సవ కల్యాణోత్సవాలు శనివారం నుంచి మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఉత్సవాలలో భాగంగా శనివారం ఉదయం 8 గంటలకు నటరాజ స్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీ శివకామ సుందరీ సమేత నటరాజస్వామి వారి ఉత్సవ మూర్తులకు పంచామృత అభిషేకాలు, మంగళ స్నానాలు, నూతన వధూవరులుగా అలంకరణ జరుగుతుంది. సాయంత్రం ఉత్సవాలకు అంకురార్పణ, మంటపారాధన, అగ్నిప్రతిష్టాపన, ధ్వజారోహణ, బలిహరణ వంటి వైదిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఇక 12వ తేదీ రాత్రి 7గంటలకు స్వామి వారి దివ్య కల్యాణోత్సవం జరుగుతుంది. రాత్రి 10 గంటల నుంచి స్వామి వారికి అభిషేకాలు, అన్నాభిషేకం, తెల్లవారుజామున ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తారు. 13వ తేదీ ఉదయం 9.30 గంటలకు మహా పూర్ణాహుతితో ఉత్సవాలు పరిసమాప్తమవుతాయి. సాయంత్రం ఉత్సవ మూర్తులకు నగరోత్సవ సేవ నిర్వహించేందుకు వైదిక కమిటీ ఏర్పాట్లు చేస్తోంది.
బాబాకు చాదర్ సమర్పణ
కొండపల్లి(ఇబ్రహీంపట్నం): హజరత్ సయ్యద్ షాబూఖారీ బాబా చల్లని దీవెనలు ప్రజలందరిపై ఉండాలని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబు ఆకాంక్షించారు. కొండపల్లిలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం హజరత్ సయ్యద్ షాబూఖారి బాబా దర్గా 428వ ఉరుసు మహోత్సవంలో శుక్రవారం ఆయన పాల్గొన్నారు. ఉరుసు మహోత్సవ కమిటీ సభ్యులు అల్తాఫ్ రజా కమిషనర్‌ను మేళతాళాలతో గుర్రం బండిపై ఎక్కించి ర్యాలీగా తోడుకుని వెళ్లారు. కమిషనర్‌తో పాటు ఏడీసీపీ జి.రామకృష్ణలను సన్మానించారు. బాబా వారికి చాదర్ సమర్పించి ప్రత్యేక ప్రార్థన చేశారు. వెస్ట్ జోన్ ఏసీపీ దుర్గారావు, సీఐ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
దివ్యపూజాబలి
ఎంతో ప్రాముఖ్యం
ఉంగుటూరు: కథోలికులకు దివ్యపూజాబలి అత్యంత ప్రాముఖ్యమైన ప్రార్థన అని విజయవాడ పోస్టరల్ సెంటర్ డైరెక్టర్ ఫాదర్ భావన విజయరాజు అన్నారు. ఉంగుటూరు మండ లం పెద్ద అవుటపల్లిలో ఈ నెల 13, 14, 15 తేదీలలో నిర్వహించనున్న తంబి వర్ధంతి మహోత్సవాలు పురస్కరించుకొని ఏడోరోజు నవదిన ప్రార్థనలు ఘనంగా జరిగాయి. పుణ్యక్షేత్ర రెక్టర్ ఫాదర్ జోసఫ్ పాలడుగు, విచారణ గురువు అభిలాష్ గోపులతో కలసి సమష్టి దివ్యపూజాబలిని సమర్పించారు. బ్రదర్ జోసఫ్ తంబి దివ్యపూజాబలి విషయంలో అందరికీ ఆదర్శంగా నిలిచారని గుర్తు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కోసం ప్రత్యేకంగా ప్రార్థనలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment