కూటమి డీల్‌ర్‌షిప్పులు | - | Sakshi
Sakshi News home page

కూటమి డీల్‌ర్‌షిప్పులు

Published Sun, Jan 19 2025 1:20 AM | Last Updated on Sun, Jan 19 2025 1:20 AM

కూటమి డీల్‌ర్‌షిప్పులు

కూటమి డీల్‌ర్‌షిప్పులు

సాక్షి, మచిలీపట్నం: ‘సార్‌.. మా కుటుంబ సభ్యులందరం గత ఎన్నికల్లో మీ కోసం పనిచేశాం. మీరేమో ఇప్పటి వరకు మాకు ఎలాంటి సాయం చేయలేదు. ఇప్పుడు నా భార్య పేరున రేషన్‌ షాపు అయినా మంజూరు చేయండి. గతంలోనే మిమ్మల్ని కలిసి విన్నవించాను. మీరేమో మరొకరికి సిఫార్సు చేస్తున్నట్లు తెలిసింది. ఎలాగైనా మాకే దక్కేలా చూడండి’.. అంటూ గూడూరుకు చెందిన ఓ అధికార పార్టీ కార్యకర్త తమ ప్రజాప్రతినిధి వద్దకు వెళ్లి విన్నవించుకున్నాడు. ‘ఇప్పటికే అధికారులతో మాట్లాడాను. నా పరిధిలోని షాపులన్నీ కచ్చితంగా మావాళ్లకే చేయాలని చెప్పాను’ అని ఆ ప్రజా ప్రతినిధి అభయం ఇచ్చారని సమాచారం. ప్రజా పంపిణీ వ్యవస్థలోని చౌక ధరల దుకాణాలను తమ కార్యకర్తలకు కట్టుబెట్టేందుకు కూటమి నాయకులు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో ఖాళీగా ఉన్న రేషన్‌ షాపులను ఇప్పటికే గుర్తించిన రెవెన్యూ అధికారులు, వాటికి డీలర్లను నియమించేందుకు గత నెలలో నోటిఫికేషన్‌ జారీ చేశారు. రెవెన్యూ డివిజినల్‌ అధికారులు తమ పరిధిలోని మండలాల్లో భర్తీ చేయబోయే ఖాళీల వివరాలతో ప్రకటనలు ఇచ్చారు. జిల్లాలోని నిరుద్యోగులు వాటిపై గంపెడాశతో దరఖాస్తు చేసుకున్నారు. అధి కార పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతూ చౌక దుకాణాలను దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

పరీక్ష తేదీ ప్రకటన

చౌక దుకాణాల నిర్వహణ కోసం జారీ చేసిన ప్రకటన ఆధారంగా వచ్చిన దరఖాస్తుదారులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. గత డిసెంబర్‌ 21వ తేదీన జరగాల్సిన రాత పరీక్షను మచిలీపట్నం డివిజన్‌లో వాయిదా వేశారు. ఆ రోజు ఉదయం పది గంటలకు జరగాల్సిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు అదే రోజు ఆర్డీఓ ప్రకటన జారీ చేశారు. అత్యవసరంగా ఎందుకు వాయిదా వేశారో స్పష్టమైన కారణం మాత్రం చెప్పలేదు. తాజాగా శనివారం ఈ పరీక్ష జరిగింది. ఉయ్యూరు, గుడివాడలో గత నెల 21వ తేదీనే పరీక్ష నిర్వహించారు. ఫలితాలను మాత్రం వెల్లడించలేదు.

వ్యవస్థను పటిష్టం చేసిన వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం

ప్రజా పంపిణీ వ్యవస్థను గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం పటిష్టం చేసింది. ఒకవైపు రేషన్‌ షాపులతో పాటు మినీ వాహనాలు (మొబైల్‌ డిస్ట్రిబ్యూషన్‌ యూనిట్‌)తో వీధి వీధి తిరిగి ప్రజలకు ఇంటి వద్దకే రేషన్‌ సరుకులు అందించింది. ఈ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించేందుకు ఎలాంటి రాజకీయాలకు తావు లేకుండా యూనిట్లు మంజూరు చేసి, ప్రజలకు సేవలు అందించేందుకు చర్యలు చేపట్టింది.

కృష్ణా జిల్లాలో 120 చౌకదుకాణాల ఏర్పాటుకు కసరత్తు మండలాల వారీగా ఖాళీలను ప్రకటించిన ఆర్డీఓలు రాత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేస్తామని ప్రకటన షాపుల కోసం నేతల చుట్టూ కూటమి కార్యకర్తల ప్రదక్షిణలు అన్నీ తమ అనుచరులకు కట్టబెట్టేందుకు నేతల కసరత్తు

పేరుకే పరీక్ష..?

రేషన్‌ షాపుల డీలర్ల నియామకం కోసం అధికారులు చేపట్టిన ప్రక్రియ రెండు దశల్లో చేయాల్సి ఉంది. ముందుగా దరఖాస్తుదారులకు రాత పరీక్ష నిర్వహించాలి. మరో రోజు మౌఖిక పరీక్ష (ఇంటర్వ్యూ) చేపట్టాలి. అయితే రెండు పరీక్షలు పేరుకే నామమాత్రంగా నిర్వహిస్తున్నారని, రాత పరీక్షతో పాటు ఇంటర్వ్యూలో స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యే చెప్పిన వారినే ఖరారు చేస్తారనే చర్చ జరుగుతోంది. ప్రాంతాల వారీగా ఖాళీగా ఉన్న రేషన్‌ దుకాణాల వివరాలను ఇప్పటికే మండల, రెవెన్యూ అధికారులు వెల్లడించడంతో ఆయా ప్రాంతాలకు చెందిన కూటమి కార్యకర్తలు నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

పారదర్శకంగా ఎంపిక

జిల్లాలో ఖాళీగా ఉన్న రేషన్‌ షాపుల నిర్వహణకు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆర్డీఓల పర్యవేక్షణలో రాత, మౌఖిక పరీక్షలు నిర్వహించి, పారదర్శకంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇప్పటికే ఆర్డీఓలు నోటిఫికేషన్లు జారీ చేయడంతో పాటు మిగతా ప్రక్రియ చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

– వి.పార్వతి, డీఎస్‌ఓ, కృష్ణా జిల్లా

డివిజన్ల వారీగా వివరాలు

డివిజన్‌ పేరు మొత్తం ఖాళీగా ఉన్న వచ్చిన

షాపుల సంఖ్య షాపులు దరఖాస్తులు

మచిలీపట్నం 307 45 117

గుడివాడ 471 46 88

ఉయ్యూరు 281 29 103

మొత్తం 1059 120 308

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement