పరిశుభ్రతతోనే ప్రజారోగ్యం
భవానీపురం(విజయవాడపశ్చిమ): ప్రజారోగ్యానికి మూలం పరిశుభ్రతేనని, ఆ దిశగా ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛాంధ్ర – స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) కోరారు. స్వచ్ఛాంధ్ర–స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా శనివారం గొల్లపూడి పంచాయతీ వద్ద జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘మన గ్రామం – స్వచ్ఛ గ్రామం’ పేరుతో ప్రతి నెలా మూడో శనివారం గ్రామంలో చెత్తను తొలగించి పరిశుభ్రతను మెరుగుపరచాలని సూచించారు. ఇటీవల సంభవించిన బుడమేరు వరద ముంపుకు ప్లాస్టిక్ వ్యర్థాలు కొంత మేర కారణమన్నారు. కలెక్టర్ జి.లక్ష్మీశ మాట్లాడుతూ.. ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు, ఖాళీ వాటర్ బాటిల్స్ డ్రెయిన్లలో వేయడం వల్ల మురుగునీటి పారుదల నిలిచిపోయి దుర్గంధంతోపాటు దోమలు ఉత్పత్తి పెరిగి ప్రజలు రోగాలపాలవుతారని ఆందోళన వ్యక్తంచేశారు. గ్రామ, మండల స్థాయి అధికారులు ఆయా గ్రామాల్లో తొలగించిన చెత్తను డంపింగ్ యార్డ్‌లకు తరలించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అందుకు అవసరమైన వాహనాలను దాతల సహకారంతో సమకూర్చుకోవాలని సూచించారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయ ప్రాంగణాల్లో నిర్వహించాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ వేదికపైన ఉన్న వారు, ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి లావణ్య కుమారి, డీపీఓ జి.ఎన్.ఎల్.రాఘవన్, డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీనివాసరావు, రూరల్ తహసిల్దార్ బి.సుగుణ, ఎంపీడీఓ బి.విగ్గిన్స్, పంచాయతీ సెక్రటరీ ఎం.స్వరూపరాణి, ప్రత్యేక అధికారి ఎం.ప్రసాద్, స్థానిక నాయకులు బొమ్మసాని సుబ్బారావు, జంపాల సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment