పట్టభద్రుల పోరుకు ముహూర్తం
సాక్షి, మచిలీపట్నం: శాసన మండలి ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి ఎన్నికల నిర్వహణకు ముహూర్తం ఖరారైంది. ఇప్పటికే ముసాయిదా ఓటరు జాబితా సిద్ధం చేసి, ఎలక్షన్ కమిషన్‌కు పంపడంతో అనుమతి లభిం చింది. దీంతో తేదీల వారీగా షెడ్యూల్‌ను విడుదల చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో జిల్లా అధికార యంత్రాంగం ఎన్నికల నిర్వహణపై దృష్టి పెట్టింది. సాధారణ ఎన్నికల తర్వాత వస్తున్న ఎలక్షన్లు కావడంతో వీటిని కూడా సజావుగా నిర్వహించడానికి చర్యలు తీసుకున్నారు.
గత ఏడాది నుంచే ప్రక్రియ
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు గత ఏడాది చివరిలోనే గ్రీన్ సిగ్నల్ లభించడంతో ప్రక్రియను ప్రారంభించిన అధికారులు.. తగిన ఏర్పాట్లు చేపట్టారు. ఓటర్ల నమోదు చేసి.. పట్టభద్రుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తులను పరిశీలించి, జాబితా తయారు చేసి ఎన్నికల సంఘానికి పంపారు. పోలింగ్ కేంద్రాల ఎంపిక, సిబ్బంది, విధులు, శిక్షణ చర్యలపై కసరత్తు చేస్తున్నారు.
నేడే నోటిఫికేషన్
పట్టభద్రుల ఎన్నికలకు సోమవారం నోటిఫికేషన్ జారీ కానుంది. అప్పటి నుంచి నామినేషన్లు దాఖలు చేయవచ్చు. ఇప్పటి వరకు ఉన్న మార్గ దర్శకాల ప్రకారం గుంటూరు జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి వద్దే నామినేషన్లు దాఖలు చేయాలి. 10వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు గడువు, 11న పత్రాల పరిశీలన చేస్తారు. 13న నామినేషన్ల ఉప సంహరణకు అవకాశం ఉంటుంది. బరిలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా అదేరోజు ప్రకటిస్తారు.
కృష్ణాలో 76 పోలింగ్ కేంద్రాలు
కృష్ణా జిల్లాలో ముసాయిదా జాబితా ప్రకారం మొత్తం 63,143 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 35,343 మంది, సీ్త్రలు 27,796, నలుగురు ఇతరులున్నారు. మచిలీపట్నంతో పాటు మున్సిపాలిటీలు, మండల కేంద్రాల్లో 76 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. వాటిలో గుడివాడ రెవెన్యూ డివిజన్ పరిధిలో 23 పోలింగ్ కేంద్రాలు, మచిలీపట్నం డివిజన్‌లో 28, ఉయ్యూరు డివిజన్‌లో 25 పోలింగ్ కేంద్రాలున్నాయి.
ఎన్టీఆర్ జిల్లాలో..
ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం ఓటర్లు 78,238 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 45,540, మహిళలు 32,685 మంది, ఇతరులు 13 మంది ఉన్నారు. వీరి కోసం 101 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ జాబితా ఇప్పటికే సిద్ధం చేసి, ఈసీకి పంపించారు. ఇందులో సున్నిత, సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించే పనిలో రెవెన్యూ, పోలీసు అధికారులున్నారు.
ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎన్నికకు వేళాయె.. నేడు నోటిఫికేషన్ 10వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు గడువు 11న నామినేషన్ల పరిశీలన.. 13న ఉపసంహరణ 27న ఎన్నికలు.. మార్చి 3న ఓట్ల లెక్కింపు కృష్ణాలో 63,143, ఎన్టీఆర్ జిల్లాలో 78,238 మంది ఓటర్లు
మార్చి 8 వరకు అమల్లో కోడ్
బరిలో ఉన్న అభ్యర్థులు ఎన్నికల నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్) మేరకు ప్రచారాలు, ఖర్చు చేసుకోవాలి. ఇప్పటికే కోడ్ అమల్లో ఉండడంతో ప్రజల నుంచి విన్నపాలు స్వీకరించే కార్యక్రమాలను తాత్కాలికంగా రద్దు చేశారు. కొత్త హామీలు, ప్రారం భోత్సవాలకు కోడ్ అమల్లో ఉంటుంది. ఈ నెల 27వ తేదీ ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. మార్చిన 3న ఓట్లను లెక్కిస్తారు. మార్చి 8వ తేదీతో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. అప్పటివరకు కోడ్ అమల్లో ఉంటుంది.
పకడ్బందీగా ఏర్పాట్లు
పట్టభద్రుల ఎన్నికలకు ఎలాంటి ఘటనలు జరగ కుండా నిర్వహించడానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఓటరు ముసాయిదా జాబితా సిద్ధమైంది. దీని ఆధారంగా పోలింగ్ కేంద్రాలు గుర్తించాం. ఆన్‌లైన్‌లో వచ్చే ఫారం–18ను క్షుణ్ణంగా పరిశీలించి, పరిష్కరిస్తున్నాం. ఎన్నిక 27న, కౌంటింగ్ మార్చి 3న ముగిసినా.. 8 వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. దీన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు తప్పకుండా పాటించాలి.
– కె.చంద్రశేఖరరావు, డీఆర్వో, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్, కృష్ణా జిల్లా
సజావుగా నిర్వహించడానికి చర్యలు
శాసన మండలి ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాం. ఇప్పటికే ముసాయిదా ఓటరు జాబితా సిద్ధం చేయడంతో పాటు అందుకు తగ్గట్లు పోలింగ్ కేంద్రాలు గుర్తించాం. రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించాం. ఎలాంటి అభ్యంతరాలు లేవని పార్టీల ప్రతినిధులు పేర్కొన్నారు. సాధారణ ఎన్నికల తరహాలోనే వీటిని కూడా పారదర్శకంగా నిర్వహిస్తాం.
–డీకే బాలాజీ, కృష్ణా జిల్లా కలెక్టర్
Comments
Please login to add a commentAdd a comment