దుర్గమ్మకు బంగారుగొలుసు, సూత్రాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు భక్తులు రూ.10 లక్షల విలువ కలిగిన బంగారు మంగళసూత్రాలు, తాడును ఆదివారం కానుకగా సమర్పించారు. విజయవాడ గుణదలకు చెందిన చింతలపట్టి మల్లికార్జునరావు కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసిన దాతలు 120 గ్రాముల బంగారంతో తయారు చేసిన గొలుసు, రెండు మంగళ సూత్రాలను డీఈఓ రత్నరాజుకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.
పీజీఆర్‌ఎస్‌కు తాత్కాలిక విరామం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉండటంతో ప్రతి వారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక( పీజీఆర్‌ఎస్‌కు)కు తాత్కాలిక విరామం ప్రకటించినట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 3 నుంచి మార్చి 8వ తేదీ వరకు ప్రతి సోమవారం కలెక్టరేట్, రెవెన్యూ డివిజన్లు, మండల కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాల్లో నిర్వహించే పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సెల్ సిస్టం కార్యక్రమానికి తాత్కాలిక విరామం ప్రకటించామని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. ప్రజలు తమ అర్జీని మీకోసం ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేసుకోవచ్చని.. ఇందుకు తమ సమీప గ్రామ లేదా వార్డు సచివాలయాన్ని సంప్రదించవచ్చని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు.
విద్యార్థులకుశ్రీపంచమి కానుక
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీపంచమి పర్వదినం పురస్కరించుకుని సోమవారం దుర్గమ్మ సరస్వతీదేవి అలంకారంలో విద్యార్థులకు, భక్తులకు దర్శనమివ్వనున్నారు. అమ్మవారి దర్శనానంతరం విద్యార్థులకు దేవస్థానం కానుకను అందజేయనుంది. వార్షిక పరీక్షలతో పాటు పోటీ పరీక్షల్లో రాణించాలని విద్యార్థులను ఆశీర్వదిస్తూ అమ్మవారి వద్ద పూజలు చేసిన పెన్ను, పాకెట్ సైజ్ ఫొటో, కంకణం, కుంకుమ ప్యాకెట్, లడ్డూ ప్రసాదాలను సిద్ధం చేసింది. ఇందుకు అవసరమైన ప్యాకెట్లను దేవస్థానం, సేవా సిబ్బంది ఆదివారం మహా మండపం నాలుగో అంతస్తులో సిద్ధం చేస్తున్నారు. సోమవారం సుమారు 40 వేల మంది విద్యార్థులు ఇంద్రకీలాద్రికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. మహా మండపం ఆరో అంతస్తులో విద్యార్థుల కోసం దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సోమవారం ఉదయం 6 నుంచి రాత్రి 7 గంటల వరకు పెన్నులను పంపిణీ చేస్తారు.
70 ప్లస్ అథ్లెటిక్స్‌లో జగదీష్‌కు కాంస్యం
టి.కొత్తపాలెం(నాగాయలంక): టి.కొత్తపాలెం శివారు మరియపురం గ్రామానికి చెందిన వెటరన్ క్రీడాకారుడు తూము జగదీష్ కుమార్ ట్రిపుల్ జంప్‌లో తృతీయ స్థానం సాధించి కాంస్య పతకం అందుకున్నారు. కేరళ రాష్ట్రం త్రిస్సూర్ జిల్లాలోని కున్నం కులంలో గత నెల 31వ తేదీ నుంచి జరుగుతున్న 6వ నేషనల్ మాస్టర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 70 ప్లస్ వయసు కేటగిరిలో ఆయన ఈ ఘనత సాధించారు. జగదీష్ రోజూ మరియపురం నుంచి నాగాయలంక హైస్కూలు గ్రౌండ్స్‌కు వచ్చి వాకింగ్, వ్యాయామం చేస్తుంటారు. గతంలో బీపీడీ, ఎంపీడీలో శిక్షణ పొందిన ఆయన జిల్లా విద్యాశాఖలో పనిచేసి రిటైర్డ్ అయ్యారు. 70 ఏళ్లకు పైగా వయస్సులో ట్రిపుల్ జంప్‌లో పతకం పొందడంపై స్థానిక హైస్కూలు స్టాఫ్, గ్రామస్తులు ఆయన్ను అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment