తొలిసారిగా పుష్కరిణిలో తెప్పోత్సవం
మోపిదేవి: శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థాన పుష్కరిణిలో గురువారం రాత్రి తొలిసారిగా తెప్పోత్సవం నిర్వహించారు. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా దేవదాయశాఖ ఆధ్వర్యాన ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హంస వాహనంపై పుష్కరిణిలో సుబ్రహ్మణ్యేశ్వరస్వామి విగ్రహం చుట్టూ విహరించారు. ఈ సందర్భంగా స్వామివారు, అమ్మవార్లను ప్రత్యేక పల్లకిలో ఆలయ ప్రదక్షిణ చేసిన అనంతరం పుష్కరిణి వరకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. పెద్ద ఎత్తున భక్తులు హరహరా అంటూ స్వామివారి పల్లకిని అనుసరించారు. పలుచోట్ల నుంచి వచ్చిన భక్తులతో పుష్కరణి ఆవరణ నిండిపోయింది. విద్యుత్ దీపాల మధ్య స్వామివారి తెప్పోత్సవం కనువిందుగా సాగింది. బాణసంచా పేల్చుతూ భక్తులను ఉత్సాహపరిచారు. దివిసీమలోనే తొలిసారిగా తెప్పోత్సవం ఏర్పాటు చేయడంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తన్వయత్వం పొందారు. డీసీ శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యాన ఆలయ ప్రధానార్చకులు బుద్దు పవన్‌కుమార శర్మ బ్రహ్మత్వంలో వేదపండితులు తొలుత పుష్కరిణికి ప్రత్యేక పూజలు, హారతులు అందించారు. అనంతరం ఆలయంలో స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అవనిగడ్డ డీఎస్పీ విద్యశ్రీ ఆధ్వర్యాన చల్లపల్లి సీఐ ఈశ్వరావు నేతృత్వంలో ఎస్‌ఐ సత్యనారాయణ పోలీస్ బందోబస్తు నిర్వహించారు.
హంస వాహనంపై
సుబ్రహ్మణ్యేశ్వరస్వామి విహారం
Comments
Please login to add a commentAdd a comment