గ్రేటర్‌ అడుగులు | - | Sakshi
Sakshi News home page

గ్రేటర్‌ అడుగులు

Published Fri, Feb 7 2025 12:52 AM | Last Updated on Fri, Feb 7 2025 12:52 AM

గ్రేట

గ్రేటర్‌ అడుగులు

ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న అధికారులు
● తాడిగడప, కొండపల్లి మున్సిపాలిటీలు విజయవాడలో విలీనం ● గొల్లపూడితో పాటు పలు పంచాయతీలు కలిపే యోచన ● 45 గ్రామాలను కలపడానికి కసరత్తు ● పన్నుల భారం పడుతుందేమోనని ప్రజల్లో ఆందోళన ● గతంలోనూ పలుమార్లు గ్రేటర్‌ ప్రతిపాదనలు

సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడను.. ‘గ్రేటర్‌’గా మార్చడానికి అధికారులు ప్రతిపాదనలు చేస్తున్నారు. ప్రస్తుతం విజయవాడను విస్త రించే అవకాశాలు లేవు. దీంతో తాడిగడప, కొండ పల్లి మున్సిపాలిటీ, నగరం చెంతనే ఉన్న శివారు గ్రామాలు, చుట్టు పక్కల ఉండే 45 గ్రామాలతో ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు, ఇందులో రామవరప్పాడు, ప్రసాదంపాడు, నిడమానురు, ప్రసాదంపాడు, గన్నవరం ,ఈడుపుగల్లు, కంకిపాడు వంటి పంచాయతీలను విలీనం చేయడానికి కసరత్తు చేస్తున్నారు. గతంలో పలుమార్లు గ్రేటర్‌ ప్రతిపాదన తెరపైకి వచ్చిన చుట్టూ పక్కల గ్రామాల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో గతంలో ఈ ప్రతిపాదనలు వెనక్కి వెళ్లాయి.

పన్నుల భారం పడుతుందని..

గ్రేటర్‌లో భాగమైతే పన్నుల భారం పడుతుందని ప్రజలు భయపడుతున్నారు. గ్రామ పంచాయతీలకు ఉన్న స్వేచ్ఛ కోల్పోతామని అందోళన చెందుతున్నారు. ఇప్పుడు గ్రేటర్‌ అయితే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఆశ చూపి, ముందుకెళ్లాలని ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం విజయవాడ నగర జనాభా దాదాపు 15 లక్షలు ఉండగా, రెండు మున్సిపాలిటీలు, చుట్టు పక్కల గ్రామాలను కలిపితే అదనంగా 10 లక్షల మంది అవుతారని, సుమారు 25 లక్షలకు పైగా జనాభాతో గ్రేటర్‌ను ఏర్పాటు చేయాలనే దిశగా ప్రతిపాదనలను అధికారులు సిద్ధం చేస్తున్నారు.

స్పెషలాఫీసర్ల పాలనలో..

ప్రస్తుతం పంచాయతీలకు పాలక వర్గాలు ఉండటంతో, ఈ ప్రతిపాదనకు అంగీకరించవనే భావనతో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. తొలుత నోటిఫికేషన్‌ విడుదల వంటి కసరత్తు చేసి, పంచాయతీ పాలక వర్గాల పదవీ కాలం ముగిసిన తర్వాత, స్పెషల్‌ ఆఫీసర్ల పాలన సమయంలో ముందుకు వెళ్లేలా ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చితే విజయవాడ నగరం కొండపల్లి, గొల్లపూడి, ఇబ్రహీంపట్నం వరకు, గన్నవరం వైపు చిన్న అవుటుపల్లి, నున్న పెనమలూరు నియోజక వర్గంలో కంకిపాడు, ఉప్పులూరు వరకు విజయవాడ నగరం విస్తరించే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
గ్రేటర్‌ అడుగులు1
1/1

గ్రేటర్‌ అడుగులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement