సమావేశంలో చర్చిస్తున్న సేవా సబ్ కమిటీ సభ్యులు
● జనవరి 1 నుంచి అమలు ● సంప్రదాయ వస్త్రధారణతో ధార్మిక విలువల పరిరక్షణ: సీఏఓ
భువనేశ్వర్: పూరీ జగన్నాథుని దర్శనానికి వచ్చే భక్తులకు సంప్రదాయ వస్త్రధారణను త్వరలో తప్పనిసరి చేయనున్నారు. డ్రెస్‌కోడ్ అమలుకు సంబంధించి కసరత్తు ఊపందుకుంది. ఒకే విధమైన రంగు, హంగులకు వస్త్రధారణ పరిమితం కాకుండా జాగ్రత్త వహిస్తున్నారు. అర్ధ నగ్న, అశ్లీల వస్త్రధారణ నివారణతో సాదాసీదా, ఆమోదయోగ్యమైన వస్త్రధారణ ప్రేరణకు పటిష్ట ప్రణాళిక రూపొందిస్తున్నారు. హాఫ్ ప్యాంట్, చినిగిన దుస్తులు, కురచ వస్త్రాలు, గౌన్లు అనుమతించరు. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల పాటు చైతన్య, అవగాహన చర్యలు చేపడతారు. ఈ మేరకు మంగళవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
పెరిగిన ఫిర్యాదులు..
శ్రీ మందిరం ప్రధాన పాలన అధికారి సీఏఓ రంజన్ కుమార్‌దాస్ మీడియాతో మాట్లాడుతూ ఆలయానికి వచ్చే భక్తుల వస్త్రధారణే ప్రధాన అంశంగా సమావేశం చర్చించినట్లు తెలిపారు. భక్తులు అసభ్యకరమైన దుస్తులు ధరించి స్వామి దర్శనం కోసం ఆలయానికి రావడంపై ఫిర్యాదుల తాకిడి పెరిగిందన్నారు. ఆలయ పవిత్రతను నీరుగార్చేలా పరిణమిస్తోందన్నారు.లక్షలాది మంది భక్తుల హృదయాల్లో ఆలయానికి ఉన్న గౌరవాన్ని నిలబెట్టుకోవడం తమ బాధ్యతని చెప్పారు. దురదృష్టవశాత్తు కొందరు సందర్శకులు ఇతరుల మతపరమైన మనోభావాలను పట్టించుకోకుండా ఆలయాన్ని సందర్శిస్తున్నారని సీఏఓ తెలిపారు. చిరిగిన జీన్ ప్యాంట్లు, స్లీవ్‌లెస్ దుస్తులు, హాఫ్ ప్యాంట్‌లు ధరించి సముద్రతీరం, పార్కులో విహరిస్తున్నట్లుగా ఆలయానికి వస్తున్నారని, దేవాలయం దేవుళ్ల నిలయం, మనోరంజక, వినోద కేంద్రం కాదని గుర్తించాలని హితవుపలికారు. ఈ నేపథ్యంలో భక్తులకు డ్రెస్‌కోడ్‌పై అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం మంగళ వారం నుంచి ప్రారంభమైందన్నారు.
కొత్త సంవత్సరం నుంచి కట్టుదిట్టం..
ఆంగ్ల సంవత్సరాది పురస్కరించుకుని జనవరి ఒకటో తేదీ నుంచి ఆమోదయోగ్యమైన వస్త్ర ధారణ తప్పనిసరి చేయనున్నట్లు సీఏఓ తెలిపారు. నియమావళి ఉల్లంఘిస్తే దర్శనానికి అనుమతించబోమని స్పష్టం చేశారు. ఆలయంలోని సింహద్వారం వద్ద మోహరించిన జగన్నాథ ఆలయ పోలీసులు (జేటీపీ) సిబ్బంది, ఆలయం లోపల ఉన్న ప్రతిహారి సేవకులకు వస్త్ర ధారణ నియమావళి అమలు చేసే బాధ్యతను అప్పగించామన్నారు. ఈ నిబంధనల నుంచి 12 ఏళ్లలోపు వారికి మినహాయింపు కల్పించినట్లు తెలిపారు. స్లీవ్‌లెస్ వంటి అరకొర దుస్తులు, షార్ట్‌లు, చిరిగిన జీన్స్, స్కర్ట్‌లు, గౌన్లు, ఇతరేతర అభ్యంతరకర దుస్తులు ధరించిన వ్యక్తులను ఆలయంలోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. భక్తులు మర్యాదపూర్వక, సంప్రదా య వస్త్ర ధారణతో స్వామిదర్శనానికి విచ్చేయాలని పిలుపునిచ్చారు. సీఏఓ అధ్యక్షతన ఆలయం కార్యాలయంలో జరిగిన సేవా సబ్ కమిటీ సమావేశంలో 36 నియోగుల సంఘం ప్రతినిధి జనార్దన్ పట్టజోషీ మహాపాత్రో, భిత్తరొచ్ఛొ భవానీ మహాపాత్రో, శ్రీ మందిరం పాలక మండలి నుంచి 5 మంది సేవాయత్ ప్రతినిధులు దుర్గాప్రసాద్ దాస్ మహాపాత్రో, అనంత్ తియాడి, మాధవ్ మహాపాత్రో, మాధవ్ పూజపండా సామంత, జగన్నాథ కొరొ, రాధా వల్లభ మఠం మహంత్ రామకష్ణ దాస్ మహరాజ్, సేవా సబ్ కమిటీ సభ్యుడు రామచంద్ర దాస్ మహాపాత్రో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment