వినికిడి యంత్రాన్ని అందజేస్తున్న జేసీ
విజయనగరం అర్బన్: విజయనగరం కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో ప్రజల నుంచి 205 వినతులను సంయుక్త కలెక్టర్ మయూర్ అశోక్ స్వీకరించారు. విజయనగరం ఆర్డీఓ సూర్యకళ డిప్యూటీ కలెక్టర్లు డి.వెంకేశ్వరరావు, బి.సుదర్శన దొర, రాజేశ్వరి, సుమబాల, సుధారాణి తదితరులు వినతులు స్వీకరించి సంబంధిత అధికారులకు వాటిని పరిష్కారం కోసం పంపించారు. వినతుల్లో అత్యధికంగా రెవెన్యూ శాఖకు సంబంధించి 134 వినతులు వచ్చాయి. వినతులను అర్జీదారుల సంతృప్తి మేరకు సకాలంలో పరిష్కరించాలని అధికారులను జేసీ అదేశించారు.
ధాన్యం కొనుగోలుపై దృష్టి పెట్టాలి
స్పందన అనంతరం జాయింట్ కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం కొనుగోలు మొదలైందని, ప్రత్యేకాధికారులు రైతు భరోసా కేంద్రాలను సందర్శించి అన్ని చోట్ల ప్రారంభించింది లేనిదీ తనిఖీలు చేయాలని సూచించారు. గన్నీ బ్యాగ్స్ ఉన్నదీ? లేనిదీ? కొనుగోలులో ఏవైనా సాంకేతిక పరమైన సమస్యలు ఉంటే వెంటనే తన దృష్టికి గానీ లేదా డీఎస్‌ఓ దృష్టికి గానీ తీసుకురావాలని స్పష్టం చేశారు. వర్షాల వల్ల కొంత ఆలస్యంగా ధాన్యం కొనుగోలు మొదలైందని వేగంగా, సక్రమంగా జరిగేలా చూడాలని పిలుపునిచ్చారు.
వినతులను సకాలంలో పరిష్కరించాలి
పార్వతీపురం: జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో వచ్చిన వినతులను సకాలంలో పరిష్కరించాలని పార్వతీపురం మన్యం జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు తెలిపారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశమందిరంలో నిర్వహించిన ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్.గోవిందరావు, జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకట రావు, కెఆర్‌సీసీ డిప్యూటీ కలెక్టర్ కేశవ నాయుడులు ప్రజలనుంచి వినతులను స్వీకరించారు. ప్రజలనుంచి వచ్చిన వినతుల పరిష్కారం కోసం సంబంధిత అధికారులతో జేసీ మాట్లాడి సకాలంలో పరిష్కరించాలని పిలుపునిచ్చారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో ప్రజలు సామాజిక, వ్యక్తిగత అంశాలపై 200 అర్జీలు అందజేశారు. ఈ సందర్భంగా పార్వతీపురం మండలం చలమవలస గ్రామానికి చెందిన సంబాన స్వామినాయుడుకు రూ.3,500లు విలువచేసే వినికిడి యంత్రాన్ని జాయింట్ కలెక్టరు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజినీరింగ్ అధికారి ఒ.ప్రభాకర రావు, జిల్లా పౌర సరఫరాల అధికారి ఆర్.శివప్రసాద్, జిల్లా వ్యవసాయ అధికారి రాబర్ట్‌పాల్, బీసీ వెల్ఫేర్ అధికారి ఎస్.కృష్ణ, ఎ.డి సర్వే కె.రాజకుమార్, జిల్లా ప్రణాళికా అధికారి పి.వీరరాజు, జిల్లా విపత్తు స్పందన అధికారి కె.శ్రీనివాస బాబు, జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.
స్పందన ఫిర్యాదుదారులకు తక్షణ న్యాయం
విజయనగరం క్రైమ్: స్పందన కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదులను పరిశీలించి ఫిర్యాదుదారులకు తక్షణ న్యాయం చేయాలని జిల్లా అదనపు ఎస్పీ అస్మా ఫర్హీన్ పోలీస్ అధికారులకు సూచించారు. ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి ప్రజల నుంచి వచ్చిన 34 ఫిర్యాదులను ఆమె స్వీకరించి, వారి సమస్యలను తెలుసుకుని, సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. బాధితులకు చట్టపరిధిలో న్యాయం చేయాలని సూచించారు. కార్యక్రమంలో దిశ డీఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, డీసీఆర్‌బీ ఎస్సై వాసుదేవ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment