అందరి సహకారంతోనే అభివృద్ధి
రాయగడ: అందరి సహకారంతోనే జిల్లా సమగ్రాభివృద్ధి సాధ్యమని జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సరస్వతి మాఝి అన్నారు. స్థానిక బిజూ పట్నాయక్ అడిటోరియంలో ఎంబీసీ సంస్థ జిల్లా వ్యవస్థాపక దినోత్సవాన్ని బుధవారం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ రాయగడ జిల్లాగా ఆవిర్భవించి 32 ఏళ్లు పూర్తయ్యాయన్నారు. మూడు దశాబ్ధాల్లో జిల్లా ఎంతో అభివృద్ధి సాధించిందని పేర్కొన్నారు. గత 24 ఏళ్ల బీజేడీ పాలనలో రాష్ట్రం ఎంతో పురోగతి సాధించిందని తెలిపారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాభివృద్ధికి నాంది పలకాలని హితవు పలికారు.
● కాగితాలకే అభివృద్ధి పరిమితం
కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన రాయగడ ఎమ్మెల్యే అప్పల స్వామి కడ్రక మాట్లాడుతూ రాయగడ జిల్లా అభివృద్ధి కేవలం కాగితాలకే పరిమితమయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ ఎన్నో గ్రామాల్లో తాగు, సాగునీరు, రహదారి, విద్యుత్ వంటి మౌలిక సౌకర్యాలు లేవన్నారు. రెండు దశాబ్ధాల కాలంలో ఇదేనా అభివృద్ధి అని ఎద్దేవా చేశారు. జిల్లాలో ఖనిజ సంపదను దృష్టిలో పెట్టుకొని ఎన్నో పరిశ్రమలు ఏర్పాటయ్యాయని గుర్తు చేశారు. అయినా జిల్లా నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు దక్కడం లేదని వాపోయారు. పొట్ట కూటి కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లి, శవాలుగా ఇంటికి చేరుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రజాప్రతినిధులు స్వప్రయోజనాలకు స్వస్థిపలికి, ప్రజా శ్రేయస్సు కోసం పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో బిసంకటక్ ఎమ్మెల్యే నీలమాధవ హికక, బీజేపీ జిల్లా శాఖ అధ్యక్షుడు శివకుమార్ పట్నాయక్, రాష్ట్ర శాఖ కార్యదర్శి రమేష్ చంద్ర సాహు తదితరులు పాల్గొన్నారు.
జెడ్పీ అధ్యక్షురాలు సరస్వతి మాఝి
Comments
Please login to add a commentAdd a comment