నిరుద్యోగుల జ్వాలలు
● మంత్రి నివాసం ముట్టడికి విఫలయత్నం
భువనేశ్వర్: ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో అక్రమాలు నిరుద్యోగ యువతని వేధిస్తున్నాయి. ఈ వేధింపులపై ప్రభుత్వ యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తుందని తీవ్ర ఆవేదనతో వారంతా నగరంలోని రాష్ట్రమంత్రి సూర్య వంశీ సూరజ్ నివాసం ముట్టడించేందుకు గురువారం ఉద్యమించారు. మరోవైపు కటక్ నగరంలో నేతాజీ బస్సు టెర్మినల్ నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఇటీవల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (ఆర్‌ఐ), ఏఆర్‌ఐ, ఐసీడీఎస్ సూపరువైజర్లు, ఎస్‌ఎఫ్‌ఎస్, అమీన్ పోస్టుల భర్తీకి ఒడిశా సబ్ ఆర్డినేటు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఓఎస్‌ఎస్‌ఎస్‌సీ) నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో 2,895 పోస్టుల భర్తీకి సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 20వ తేదీ వరకు ప్రాథమిక రాత పరీక్షలు జరుగుతాయని ప్రకటించింది. ఈ పరీక్షలు ఆన్‌లైన్‌లో నిర్వహిస్తుంది. ఈ క్రమంలో ఊహాతీతమైన అక్రమాలు వెలుగు చూసినట్లు ఔత్సాహిక అభ్యర్థుల వర్గం బాహటంగా ఆరోపించింది. ఆన్‌లైన్‌లో పరీక్షల నిర్వహణ వెసులుబాటు ఉండడంతో సైబర్ కేఫేల్లో రాత పరీక్షలు కొనసాగిస్తున్నారు. దీనిపై ఎటువంటి నిఘా లేకపోవడంతో భారీ అవక తవకలు చోటు చేసుకుంటాయని, తక్షణమే ఈ అక్రమానికి కళ్లెం వేసేందుకు ఆన్‌లైన్ పరీక్షల విధానం రద్దు చేసి, ఆఫ్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించాలని యువతరం ఆందోళనకు దిగింది. వీరి ఆందోళనతో స్థానిక నయాపల్లి ప్రాంతంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వీరంతా రాష్ట్ర మంత్రి సూర్య వంశి సూరజ్ నివాస భవనం ముట్టడించేందుకు దూకుడు ప్రదర్శించారు. సకాలంలో పోలీసులు చొరవ కల్పించుకుని నిరసనకారుల్ని చెదరగొట్టారు. ఇటీవల ఓఎస్‌ఎస్‌ఎస్‌సీ నిర్వహించిన ఫారెస్టర్, ఎల్‌ఐ పోస్టుల భర్తీ ప్రక్రియలో అక్రమాలకు పాల్పడినట్లు ఈ సందర్భంగా గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment