పెట్టుబడులకు ఒడిశా అనుకూలం
భువనేశ్వర్: రాష్ట్ర పారిశ్రామిక రంగం విస్తరణకు ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి భారీ సన్నాహాలు చేస్తున్నారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు పెట్టుబడులను ఆకట్టుకునేందుకు పలు దేశాల రాయబారులతో ఆయన గురువారం సమావేశమయ్యారు. న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో 34 దేశాల రాయబారులు పాల్గొన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి మాట్లాడుతూ.. పారిశ్రామిక పెట్టుబడులకు ఒడిశా అనుకూలమైనదిగా వివరించారు. రాష్ట్రంలో పారిశ్రామిక అనుకూల వాతావరణంపై ప్రత్యక్ష అవగాహన కల్పించేందుకు ఎక్సలెన్సు ఒడిశా పారిశ్రామిక కాంక్లేవ్ – 2025 నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. రానున్న రోజుల్లో ఒడిశా అతిపెద్ద పారిశ్రామిక హబ్‌గా వెలుగొందుతుందని పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 2047 సంవత్సరం నాటికి వందేళ్లు అవుతుందని, అప్పటికి దేశ పురోగతిలో ఒడిశా సింహభాగం భాగస్వామ్యం కలిగి ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రీన్ ఫ్యూయెల్, ఆహార ఉత్పాదన, ఎలక్ట్రానిక్స్, సాంకేతిక సమాచారం, సెమీ కండక్టర్లు, పెట్రో కెమికల్స్ ఇతరేతర రంగాల్లో భారీ పెట్టుబడులతో ఉన్నత స్థాయి పరిశ్రమల ఏర్పాటు దిశలో ఒడిశా వ్యూహాత్మక పారిశ్రామిక విస్తరణ కార్యాచరణతో నిరంతరం కృషి చేస్తుందన్నారు. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రముఖ కార్యదర్శి, పరిశ్రమల శాఖ మంత్రి, అనుబంధ శాఖల ప్రముఖ కార్యదర్శులు పాల్గొన్నారు.
సీఎం మోహన్ చరణ్ మాఝీ
Comments
Please login to add a commentAdd a comment