చిరుతల గణన నివేదిక వెల్లడి
భువనేశ్వర్: రాష్ట్రంలో తొలిసారిగా చిరుత పులుల సంతతిని లెక్కించారు. ఈ మేరకు ఇటీవల అనుబంధ సిబ్బంది, యంత్రాంగానికి కెమెరా ట్రాపింగు ఇతరేతర రంగాల్లో ప్రత్యేక శిక్షణ కల్పించారు. రాష్ట్ర అటవీ శాఖ స్వతంత్రంగా ఈ లెక్కింపు చేపట్టింది. ఈ లెక్కింపులో రాష్ట్రంలో సమగ్రంగా 696 చిరుతు పులులు ఉన్నట్లు వెల్లడించారు. పులుల సంచార ప్రాంతాల్లో కెమెరా ట్రాపింగ్, పాదముద్రలు వంటి విధానాలతో ఈ ప్రక్రియ నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో వేర్వేరు చోట్ల 284 కెమెరాలను అమర్చారు. పులుల సంతతి పరిరక్షణ ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర అటవీ శాఖ ఈ సన్నాహానికి నడుం బిగించడం విశేషం. 2022 సంవత్సరంలో జాతీయ పులుల సంరక్షణ వర్గం(ఎన్‌టీసీఏ) రాష్ట్రంలో పులుల సంతతి లెక్కింపు నిర్వహించింది. ఈ గణనలో రాష్ట్రంలో 568 పులులు ఉన్నట్లు తేల్చింది. అంతకు ముందు 2018 సంవత్సరంలో నిర్వహించిన లెక్కల్లో 760 పులులు రాష్ట్రంలో సంచరిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది తొలిసారిగా రాష్ట్ర అటవీ శాఖ చిరుత పులుల సంతతిని లెక్కించి విశ్వసనీయ గణాంకాలను వెల్లడించిందని భావిస్తున్నారు. తాజా గణాంకాల ప్రకారం రాష్ట్రంలో సాధారణ చిరుత పులులతో నల్ల చిరుత పులులు కూడా సంచరిస్తున్నట్లు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment