రహస్యమేమీ లేదు
రత్న భాండాగారంలో...
● స్పష్టం చేసిన మంత్రి పృథ్వీరాజ్
హరిచందన్
● కార్తీకం తర్వాత నిర్వహణ
కార్యకలాపాలు
భువనేశ్వర్:
పూరీ శ్రీజగన్నాథ మందిరం రత్న భాండాగారంలో ఊహించిన మేరకు ఎటువంటి రహస్యం లేదని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ శుక్రవారం స్పష్టం చేశారు. రత్న భాండాగారం లోపల సొరంగం, లెక్కకు చిక్కని నిధి వంటి పలు రహస్యాలు ఉంటాయని కొన్ని వర్గాలు విస్తారంగా ప్రసారం చేశాయి. ఇవి అవాస్తవమని తేలిందని మంత్రి తెలియజేశారు. పవిత్ర కార్తీక మాసం తర్వాత రత్న భాండాగారం నిర్వహణ కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. రత్న భాండాగారం వెలుపల, లోపలి భాగాల నిర్వహణ పనులు పూర్తి చేయనున్నారు. భారత పురావస్తు శాఖ(ఏఎస్‌ఐ) ఈ పనులు చేపడుతుంది. త్వరలో రత్న భాండాగారం పరిశీలన సమగ్ర నివేదిక ప్రచురితం అవుతుందన్నారు.
● ఆభరణాల లెక్కింపు
శ్రీజగన్నాథ రత్న భాండాగారంలోని అమూల్య సంపద లెక్కింపు ప్రక్రియకు రంగం సిద్ధం చేశారు. కొత్త సంవత్సరంలో ఈ పనులు ప్రారంభించేందుకు యోచిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. భాండాగారం గోడలు బీటలు వారినట్లు ప్రాథమిక సమాచారం. రత్న భాండాగారం వెలుపల, లోపల మరమ్మతులు, నిర్వహణ ఇతరేతర అనుబంధ కార్యకలాపాలు పూర్తి కావడంతో ఆభరణాల లెక్కింపు ప్రారంభించడం జరుగుతుంది. లెక్కింపు పూర్తయ్యాక లోగడ సిద్ధం చేసిన లెక్కింపు వివరాలతో సరి తూయనున్నట్లు అధికార వర్గాల సమాచారం. ఆభరణాల లెక్కింపు ఆరంభమైన 7 రోజుల్లో సమగ్ర నివేదిక వెల్లడించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
● రద్దీ దృష్ట్యా...
కార్తీక మాసం పురస్కరించుకుని శ్రీమందిరం భక్తులతో కిటకిటలాడుతోంది. ఈ నేపథ్యంలో కార్తీక మాసం ముగిసిన తర్వాత రత్న భాండాగారం పనులు ప్రారంభించాలని నిర్ణయించారు. అది మొదలుకొని సుమారు నెలన్నర రోజులపాటు ఈ పనులు కొనసాగుతాయని భారత పురావస్తు శాఖ అంచనా. దీర్ఘకాలం తర్వాత ఈ ఏడాది జులై 14వ తేదీన తొలిసారిగా రత్న భాండాగారం తెరిచిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా 11 మంది సభ్యుల బృందం రత్న భాండాగారం లోనికి అడుగిడింది. దీనిలో చెక్క పెట్టెలు, బీరువాలు ఉన్నట్లు ఈ బృందం గుర్తించింది. మరోమారు జులై 18వ తేదీన లోపలి రత్న భాండాగారం తెరిచి క్షుణ్ణంగా పరిశీలించడంతో 3 చెక్క పెట్టెలు మరియు 4 బీరువాలు ఉన్నట్లు ధ్రువీకరించారు. వీటిలో ఒకటి స్టీలు బీరువా, మిగలిన 3 చెక్క బీరువాలు ఉన్నాయి. అలాగే 2 చెక్క పెట్టెలు, 1 ఇనుప పెట్టె ఉన్నట్లు గుర్తించారు. వీటన్నింటినీ శయన సామగ్రి భద్రపరిచే ఖొట్టొసెజ్జొ గృహానికి తరలించి గట్టి భద్రత మధ్య తాత్కాలికంగా పదిలపరిచారు. ఈ ఏడాది సెప్టెంబర్ 21వ తేదీన భారత పురావస్తు శాఖ(ఏఎస్‌ఐ) రత్న భాండాగారం లోపల, వెలుపల లేజరు స్కానింగ్, రాడార్ సర్వే చేపట్టిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment