రెండు ఆటోలు ఢీ
మెళియాపుట్టి/టెక్కలి రూరల్: రెండు ఆటోలు పరస్పరం ఢీకొట్టిన ఘటనలో మెళియాపుట్టి మండలం జలక లింగుపురం గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థులు గాయపడడ్డారు. ఈ ఘటన మండల కేంద్రంలోని భారత్ గ్యాస్ ఏజెన్సీ సమీపంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు, విద్యార్థులు తల్లిదండ్రులు తెలిపిన వివరాల మేరకు.. జలక లింగుపురం గ్రామానికి చెందిన ఏడుగురు టెన్త్ విద్యార్థులు మెళియాపుట్టి మండల కేంద్రంలోని ట్యూషన్ సెంటర్‌కు ఉదయం 6 గంటల ప్రాంతంలో ఆటోలో బయలుదేరారు. మెళియాపుట్టి గ్యాస్ కార్యాలయం వద్దకు రాగానే చికెన్ వ్యర్థాలు తరలించే వేరొక ఆటో డ్రైవర్ విద్యార్థులవైపు చూస్తూ వెకిలిచేష్టలతో సమీపంలోకి వచ్చాడు. విద్యార్థులున్న ఆటోడ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో ఆటోలు పరస్పరం ఢీకొని బోల్తాకొట్టాయి. ఈ ఘటనలో గాయపడిన విద్యార్థులు బాలకృష్ణ, హేమలత, పవన్‌సాయి, ధనుశ్రీ, విష్ణుప్రియ, నాగచైతన్యలను తొలుత మెళియాపుట్టికి పీహెచ్‌సీకి తీసుకెళ్లగా సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో టెక్కలి జిల్లా ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న డీఈవో తిరుమల చైతన్య ఆస్పత్రికి చేరుకుని విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏఎస్సై నరసింహరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment