జీఎస్టీ దాడులు.. యువ వ్యాపారి మృతి
జయపురం: జీఎస్టీ అధికారులు దాడుల ఒత్తిళ్లు భరించలేక ఓ యువ వ్యాపారి చనిపోయిన ఘటన జయపురంలో కలకలం రేపింది. దీంతో స్థానిక వ్యాపారులు శనివారం వ్యాపార సంస్థల బంద్‌కు పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయం వేదికలో నిర్వహించిన అత్యవసర పత్రికా ప్రతినిధుల సమావేశంలో చాంబర్ అధ్యక్షుడు వి.ప్రభాకర్ ఈ విషయం వెల్లడించారు. మైన్ రోడ్డులో గల న్యూ వాసవీ బంగారు షాపు యజమాని షాపుపైన ఇంటిపైన రెండు రోజుల కిందట జీఎస్టీ అధికారులు దాడి జరిపారని, అందుకు మనస్తాపానికి గురై ఆ షాపు యజమాని పి.హర ప్రసాద్ (42) అస్వస్థతకు గురై స్థానిక ప్రైవేటుఆస్పత్రిలో చేరి కన్నుమూశారని తెలిపారు. ఈ సంఘటనపై తీవ్రంగా స్పందించిన చాంబర్ ఆఫ్ కామర్స్ బంద్‌కు పిలుపునిచ్చిందని తెలిపారు. అధికారులకు కేవలం పండగల సమయంలోనే వ్యాపార వాణిజ్య సంస్థలపై దాడులు జరుపటం పరిపాటిగా మారిందని ఆయన మండిపడ్డారు. బంద్ నుంచి పాఠశాలలు, బస్సులు, ఇతర వాహనాలు, అత్యవసర సర్వీసులు మినహాయిస్తున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో కార్యదర్శి డి.మాధవ, డైరెక్టర్లు కె.రామకృష్ణ, ఎ.శ్రీనివాసరావు, కె.ఈశ్వర రావు, లోకనాథ్ పాఢీ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment