భువనేశ్వర్: స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కూడా రాష్ట్రంలో ఆకలి చావులు ఇంకా వెలుగు చూస్తున్నాయి. దీపావళి నాడు దేశమంతా సంబరాల్లో మునిగి తేలుతూ ఉంటే కంధమాల్ జిల్లాలో ఓ చీకటి ఘటన బయటపడింది. కూటికి బియ్యపు గింజలు కొరవడి పొట్ట నింపుకునేందుకు మామిడి బద్దల జావ తాగడంతో నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఆహార భద్రత రేషను కార్డుల పునఃపరిశీలన పురస్కరించుకుని గత కొన్ని నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం రేషను కింద బియ్యం పంపిణీ నిరవధికంగా నిలిపి వేసింది. ఆకలిని తాళలేక ఎండలో ఆరబెట్టి పదిలపరచుకున్న మామిడి బద్దలు చేర్చి కొద్దిపాటి బియ్యంతో జావ వండుకుని దినం గడుపుకుంటున్న గడ్డు పరిస్థితులు ఇద్దరు మహిళల ప్రాణాల్ని పొట్టబెట్టుకున్నాయి.
కంధమల్ జిల్లా దారింగిబాడి మండలం గొద్దాపూర్ పంచాయతీ మొండిపొంకా గ్రామంలో ఈ సంఘటన జరిగింది. మామిడి బద్దల జావ ఆరగించి ఇద్దరు మహిళలు కన్ను మూశారు. సుమారు 10 మంది అనారోగ్యం పాలవ్వగా ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. బరంపురం ఎమ్‌కేసీజే ఆస్పత్రిలో చికిత్స పొందుతు మహిళ రుమితా పట్టొమాఝి మృతి చెందింది. చికిత్స కోసం తరలిస్తుండగా దివ్యాంగ యువతి రుణు మాఝి మృతి చెందడం విచారకరం. మరో 6 మంది విషమ పరిస్థితిలో చికిత్స పొందుతున్నారు.
నేరం ఆకలిది..
రాష్ట్రంలో ఆహార భద్రత లోపానికి ఈ సంఘటన అద్దం పడుతుంది. గత 3 నెలలుగా ఈ ప్రాంతంలో ప్రజలకు ఆహార భద్రత రేషను కింద బియ్యం పంపిణీ కావడం లేదు. బీదరికంలో కొట్టుమిట్టాడుతున్న ఈ కుటుంబం మామిడి టెంకల జిగురుతో కడుపు నింపుకుని పబ్బం గడుపుకోవాల్సి వచ్చింది. ఈ దయనీయ పరిస్థితి నిండు ప్రాణాల్ని బలిగొందని ప్రత్యక్ష సాక్షుల కథనం. గత 3 నెలలుగా బియ్యం పంపిణీ లేకపోవడంతో మామిడి టెంకలతో పొట్ట నింపుకుంటున్నామని మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈ ఘటనపై రాష్ట్ర ఆరోగ్య శాఖ తక్షణమే స్పందించింది. ప్రత్యేక వైద్య బృందాన్ని ప్రభావిత గ్రామానికి తరలించినట్లు రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టరు విజయ్ మహాపాత్రో తెలిపారు. ఈ సంఘటనలో 8 మంది అనారోగ్యానికి గురైనట్లు సమాచారం. వీరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఆహార కాలుష్యంతో ఈ సంఘటన చోటు చేసుకుందని భావిస్తున్నారు. వైద్య బృందం పరిశీలన ఆధారంగా ఈ సంఘటన పూర్వాపరాలు స్పష్టమవుతాయని నిరీక్షిస్తున్నారు.
దర్యాప్తునకు ఆదేశాలు: మంత్రి
ఈ సంఘటనపై శాఖాపరమైన దర్యాప్తునకు ఆదేశించినట్లు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టరు ముఖేష్ మహాలింగ్ తెలిపారు. స్థానిక జిల్లా ప్రధాన వైద్య అధికారి, ఆరోగ్య శాఖ డైరెక్టరు దర్యాప్తు నిర్వహిస్తారు. మృతుల పోస్టుమార్టం నివేదిక తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయి.
మామిడి బద్దల జావ తాగి ఇద్దరు మృతి
మరో ఆరుగురి పరిస్థితి విషమం
Comments
Please login to add a commentAdd a comment