ఉత్తమ అవినీతి నిరోధక అధికారికి సత్కారం
జయపురం: రాష్ట్రంలో ఉత్తమ అవినీతి నిరోధక విజిలెన్స్ ఎస్పీగా ముఖ్యమంత్రి నుంచి అవార్డు నందుకున్న కొరాపుట్ విజిలెన్స్ డివిజన్ జయపురం ఎస్పీ ప్రత్యూష్ కుమార్ ద్వివేదిని ఆయన కార్యాలయ సిబ్బంది శుక్రవారం ఘనంగా సన్మానించారు. కొరాపుట్ విజిలెన్స్ డివిజన్లో గల ఆరు జిల్లాలు కొరాపుట్, నవరంగపూర్, రాయగడ, మల్కన్‌గిరి, నువాపడ, కలహండిలలో 2023 లో ఆదాయం కంటే ఎక్కువ ఆదాయం గల 13 కేసులు పట్టుకున్నారు. అలాగే లంచం తీసుకుంటుండగా 17 కేసులు, ప్రభుత్వ నిధులు స్వాహా చేసిన ఉద్యోగులపై 11 కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ నిధులు స్వాహా చేసిన కేసుల్లో బొయిపరిగుడ పోలీసు అధికారి సుశాంత కుమార్ శతపతి నుంచి రూ.37 లక్షలు స్వాధీనం చేసుకోగా.. మృత్తికా సంరక్షణ అధికారి కిశోర్ చంద్ర నాయిక్ నుంచి రూ.11.44 లక్షలు పట్టుకున్నట్లు గుర్తు చేశారు. గత ఏడాది కొరాపుట్ విజిలెన్స్ డివిజన్లో ఎక్కువ కేసులు పట్టుకున్నందుకు అవార్డు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయనను ఘనంగా సత్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment