తాబేళ్ల ఆగమనం!
● సంతానోత్పత్తి సీజన్ కావడంతో
అధికారుల ఆంక్షలు
● తీర ప్రాంతంలో చేపల వేట నిషేధం
● మే 31వ తేదీ వరకు కొనసాగింపు
భువనేశ్వర్: రాష్ట్ర సముద్ర తీర ప్రాంతం తాబేళ్లకు పురిటిల్లుగా ప్రసిద్ధి. అపురూపమైన ఆలివ్ రిడ్లే తాబేళ్ల సంతతి తీర ప్రాంతాల్లో విశేషంగా వృద్ధి చెందుతుంది. పర్యావరణ అనుకూలతతో సంరక్షణ వ్యవస్థ ఈ సంతతి వృద్ధికి దోహదపడుతుంది. సుదూర తీర ప్రాంతాల నుంచి అధికంగా ఆలివ్ రిడ్లే తాబేళ్లు రాష్ట్రంలోని తీర ప్రాంతానికి సంతానోత్పత్తి కోసం వస్తుంటాయి. ఏటా నవంబర్ నెల నుంచి ఇవి రావడం ఆరంభం అవుతుంది. ఆగమనం నుంచి గుడ్డు పెట్టి వాటిని పొడిగి పిల్లలు అయ్యేసరికి ఏడు నెలలు పడుతోంది. ఈ సమయంలో తాబేళ్లు గూళ్లు కట్టి గుడ్లు పెట్టడం, పొదగడం పూర్తి అవుతుంది. గుడ్లు పెట్టేందుకు చాలా దూరం నుంచి గుట్టలు గుట్టలుగా తరలి వచ్చిన ఆలివ్ రిడ్లే తాబేళ్లు కొత్త సంతానంతో మారుమూల ప్రాంతాలకు తరలి వెళ్తాయి.
రాష్ట్రంలో గహిర్‌మం్ అభయారణ్య సుమద్ర తీరం, రుషి కుల్య సాగర తీరం, ధామ్రా బీచ్, దేవీ నదీ సముద్ర సంగమ తీరం ఆలివ్ రిడ్లే సంతతి విస్తరణకు అనుకూలమైన తీర ప్రాంతాలు. ఏటా నవంబర్ నెల ఆరంభం నుంచి మే నెల ఆఖరు వరకు వందల కొద్దీ నాటికల్ మైళ్ల దూరం నుంచి ఈ తీర ప్రాంతాలకు చేరుతాయి. పెట్టిన గుడ్లు పొదిగేంత వరకు ఈ తీరంలో ఈదులాడుతు కొత్త సంతానానికి ఈ ప్రాంతం నుంచి ప్రపంచపు వెలుగులు పరిచయం చేసి వెనుదిరుగుతాయి. వీటి ఆగమనం నుంచి తిరోగమనం వరకు కంటికి రెప్పలా సంరక్షణ యంత్రాంగం నిర్వీరామంగా శ్రమిస్తుంది.
చేపల వేట నిషేధం
ఆలివ్ రిడ్లే సంతతి వృద్ధి పురస్కరించుకుని తీర ప్రాంతాల్లో చేపల వేట పూర్తిగా నిషేధిస్తారు. సుమారు ఏడు నెలలు ఈ ఆంక్షలు నిరవధికంగా కొనసాగుతాయి. ఈ వ్యవధిలో ప్రభావిత మత్స్యకారులకు ప్రభుత్వం సముచిత పరిహారం చెల్లిస్తుంది. ఆంక్షల ఉల్లంఘనకు పాల్పడిన వారి వ్యతిరేకంగా వన్య ప్రాణుల సంరక్షణ చట్టం తదితర అనుబంధ చట్టాల కింద కఠిన చర్యలు చేపడుతుంది. చేపల వేట సందర్భంగా ట్రాలర్ల వినియోగం అమాయక తాబేళ్లకు ప్రాణ హానిగా పరిగణించి చేపల వేట పూర్తిగా నిషేధిస్తారు. ఆలివ్ రిడ్లే ఆవాస తీర ప్రాంతాల్లో 20 కిలో మీటర్ల సువిశాల పరిధిలో చేపల వేట నిషేధం ఆంక్షలు జారీ అయ్యాయి. ఈ ఆంక్షలు వచ్చే ఏడాది మే నెల 31వ తేదీ వరకు నిరవధికంగా కొనసాగుతాయని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మైరెన్ ఠాణా పోలీసుల ప్రత్యక్ష పర్యవేక్షణలో తాబేళ్ల సంరక్షణ కార్యకలాపాల్ని అటవీ, పర్యావరణ శాఖ నిర్వహిస్తుంది.
మార్చి నుంచి...
నవంబర్ నుంచి తీర ప్రాంతానికి చేరే తాబేళ్లు సాధారణంగా ఏటా మార్చి నెల నుంచి గుడ్లు పెట్టడం ఆరంభిస్తాయి. అనంతరం మే నెలాఖరు సరికి పొడగం పూర్తి కావడంతో సురక్షితంగా వెనుదిరుగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment