యువకుడి చేతిలో చిన్నాన్న హతం
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి మోటు పోలీసుస్టేషన్ పరిధిలో గల బంఝిగూఢ గ్రామం భీమ మాడి (53)అనే వ్యక్తిని తన అన్న కొడుకు లచ్చ మాడి హత్య చేశాడు. వివరాల్లోకి వెళితే.. గురువారం ఉదయం భీమ మాడి ఆవు లచ్చ మాడి పొలంలోకి వెళ్లి మేసింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలై గొడవ వరకు వెళ్లింది. ఆ గొడవలో లచ్చ మాడి గొడ్డలితో తన చిన్నాన్న భీమతలపై కొట్టగా.. ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిపై మృతుని కుటుంబ సభ్యులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కలిమెల ఆరోగ్య కేంద్రానికి తరలించారు. శుక్రవారం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. లచ్చ మాడిపై హత్య చేసు నమోదు చేసి శుక్రవారం కోర్టులో హాజరుపరిచారు.
రెండు బైక్‌లు ఢీ: ఒకరి మృతి
జయపురం: జయపురం పట్టణ 26వ జాతీయ మార్గంలో గల ఎల్‌ఐసీ కార్యాలయ సమీపంలో గురువారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. రెండు బైక్‌లు ఢీకొని ప్రమాదం జరగ్గా అదే సమయంలో ఒక టిప్పర్ ఒక బైక్ పై ఉన్న వ్యక్తిని ఢీకొట్టింది. దీంతో అతను మరణించాడు. ఆ సంఘటన చూసిన స్థానికులు టిప్పర్ డ్రైవర్‌పై దాడి చేయడంతో అతను గాయపడ్డాడు. ప్రమాద సమాచారం తెలిసిన పోలీసులు చేరుకుని.. క్షతగాత్రులను జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. సంఘటనలో మరణించిన వ్యక్తిని నవరంగపూర్ జిల్లా రాయిఘర్ సమితి పంచరపరా గ్రామం కోలనీ బలరాం హంతాల్(50)గా గుర్తించారు. బైకిస్టు కొరాపుట్ సదర్ పోలీసు స్టేషన్ పరిధి దేవ్‌గాం గ్రామం రమేష్ ఖొర(35)అని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ప్రమాదంలో గాయపడిన వారు పంచరపరా గ్రామ కోలనీ ఘాశీరాం హంతాల్(35) కాగా మిగతా వారు జయపురం సదర్ పోలీసు స్టేషన్ అంబాగుడ గ్రామానికి చెందిన మను హరిజన్(21), దిలీప్ హరిజన్(16), సంజీవ్ హరిజన్(19) అని పోలీసులు తెలిపారు. అంబాగుడ నుంచి ముగ్గురు ఒక బైక్ పై వస్తుండగా జయపురం నుంచి నవరంగపూర్ రాయిఘర్‌కు వెళ్తున్న బైక్ ఢీకొనటంతో ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం తర్వాత బంధువులకు అప్పగించారు.
జేసీబీని దగ్ధం చేసిన
దుండగులు
రాయగడ: జిల్లాలోని సదరు సమితి జిమిడిపేట పంచాయతీ పరిధి పత్రాపుర్ గ్రామం నాగావళి నదీ తీరంలో ఇసుక రీచ్‌లో నిలిపి ఉన్న జేసీబీని గుర్తు తెలియని దుండగులు తగులబెట్టారు. గురువారం అర్ధరాత్రి కొంత మంది దీనికి నిప్పుపెట్ట తగులబెట్టి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న శశిఖాల్ ఐఐసీ మున్ని ఆచార్య సంఘటన స్థలాన్ని శుక్రవారం పరిశీలించారు. ఎవరు.. ఎందుకు తగలబెట్టారో అనే కోణంలొ దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. జేసీబీ ముందు భాగం పూర్తిగా దగ్ధమైంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
భువనేశ్వర్‌లో
భారీ అగ్ని ప్రమాదం
● అండర్‌గ్రౌండ్ దుకాణాలు దగ్ధం
భువనేశ్వర్: భువనేశ్వర్‌లో భారీ అగ్ని ప్రమాదం గురువారం రాత్రి చోటుచేసుకుంది. స్థానిక యూనిట్–1, 2 అంగడి సముదాయాల అనుసంధాన భూగర్భ దుకాణాల సముదాయం అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో లక్షలాది రూపాయల విలువైన వస్తుసామగ్రి బూడిదైంది. వీటిలో ఆరు బట్టల దుకాణాలు మంటలకు ఆహుతయ్యాయి. అగ్నిమాపక దళం సుమారు నాలుగు గంటలు నిర్వీరామంగా శ్రమించి మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు.
Comments
Please login to add a commentAdd a comment