పోరాట యోధుడు భక్షీపాత్రో
జయపురం: అవిభక్త కొరాపుట్ గిరిజనుల హక్కుల సాధనకు, వారిని పోరాట బాటలో నడిపిన ప్రజానేత స్వర్గీయ హరిశ్చంద్ర భక్షీ పాత్రో అని న్యాయవాది, సమాజ సేవకుడు హరిహర కరసుధా పట్నాయక్ అన్నారు. భక్షీపాత్రో 91వ జయంతోత్సవం సందర్భంగా ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. స్థానిక కార్మిక భవనంలోఉత్కళ సమ్మిళీనీ కొరాపుట్ జిల్లా అధ్యక్షుడు మదన మోహననాయిక్ అధ్యక్షతన జరిగిన బక్షీ పాత్రో జయంతి ఉత్సవంలో పట్నాయక్ మాట్లాడుతూ.. రెవెన్షా కళాశాలలో విద్యార్థి ఉద్యమంలో పాల్గొని ఆ కళాశాల నుంచి విద్యార్థి యూనియన్ అధ్యక్షునిగా అవిభక్త కొరాపుట్ నుంచి ఎన్నికై న ప్రథమ వ్యక్తి భక్షీపాత్రో కావటం జిల్లా ప్రజలు గర్వించదగిన విషయం అన్నారు. కమ్యూనిస్టుగా తన రాజకీయ జీవితం ప్రారంభించిన భక్షీ అవిభక్త కొరాపుట్‌లో అన్ని గ్రామాల్లో పర్యటించి ఆదివాసీ, దళితుల సమస్యలు తెలుసుకొని వాటి సాధనకు పోరాటాలు జరిపిన పేదల పెన్నిధి అని కొనియాడారు. ఎమర్జన్సీ సమయంలో అరెస్టయి జైలు జీవితం గడపిన ఆయన విడుదల అయిన తరువాత ఉత్కళ కాంగ్రెస్, జనతా పార్టీ చేరినప్పటికీ ప్రజా సమస్యలపై పోరాటం చేయటంలో ఏనాడు వెనుకడుగు వేయలేదని గుర్తు చేశారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా ఆయన రాష్ట్ర ప్రజలకు అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఉత్కళ సమ్మిళినీ ఉద్యమానికి అందించిన సేవలు మరువలేనివని కొనియాడారు. అవిభక్త కొరాపుట్ ఉన్నతికి, పరిశ్రమలు, విద్యాలయాల ఏర్పాటులో ఆయన పోషించిన ప్రధాన భూమిక మరువ లేనిదని ప్రశంసించారు. ముందుగా స్వర్గీయ భక్షీపాత్రో చిత్ర పటానికి పూల మాలలు వేసి శ్రద్ధాంజళి ఘటించారు. సభలో జయపురం మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్, సీనియర్ బీజేడీ నేత సూర్యనారాయణ నథ్, పరమేశ్వర పాత్రో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment