దివ్యాంగులకు ట్రై సైకిళ్ల పంపిణీ
రాయగడ: దివ్యాంగులకు ట్రైసైకిళ్లను అధికారులు పంపిణీ చేశారు. జిల్లాలోని మునిగుడ సమితి కార్యాలయం సమావేశం హాల్‌లో సోమవారం జరిగిన వినతుల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఫరూల్ పట్వారి ఐదుగురు దివ్యాంగులకు ట్రైసైకిళ్లను అందజేశారు. ఈ సందర్భంగా 97 వినతులను స్వీకరించారు. ఇందులో 77 గ్రామసమస్యలు ఉండగా.. మరో 20 వ్యక్తిగత సమస్యలుగా గుర్తించారు. వీటిని పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో గుణుపూర్ సబ్ కలెక్టర్ కిరణ్ దీప్ కౌర్ సహాట, జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వాహక అధికారి నిహారి రంజన్ కుహోరో, జిల్లా ముఖ్యవైద్యాధికారి డాక్టర్ లాల్ మోహన్ రౌత్రాయ్ పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా రెండు స్వయం సహాయక బృందాలకు చెందిన మహిళలకు ఏడు లక్షల రుపాయల ఆర్థిక సహాకారాన్ని అందించారు. అలాగే వైద్య ఖర్చుల నిమిత్తం మరో నలుగురికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ. ఎనిమిది వేల చొప్పున ఆర్థిక సాయాన్ని పంపిణీ చేశారు.
ఆటోని ఢీకొన్న ఎమ్మెల్యే కారు
భువనేశ్వర్: ఖుర్దా జిల్లా బొడొ పొఖొరియా ఛక్ ప్రాంతంలో సోమవారం రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే కారు ఆటోని ఢీకొంది. ఈ కారు గంజాం జిల్లా ఖల్లికోట నియోజక వర్గం ఎమ్మల్యే పూర్ణ చంద్ర సెఠికి చెందినదిగా గుర్తించారు. ఎదురుగా వెళ్తున్న ఆటోని వెనుక నుంచి ఎమ్మెల్యే కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్‌తో పాటు నలుగురు గాయపడ్డారు. బాధితులను ఖుర్దా జిల్లా ప్రధాన ఆస్పత్రిలో చేర్పించారు. ప్రమాదానికి గురైన కారులో భువనేశ్వర్ వెళ్తున్న ఎమ్మెల్యే పూర్ణ చంద్ర సెఠి క్షేమంగా ఉన్నారు. జంకియా ఠాణా పోలీసులు ప్రమాదానికి గురైన ఆటోని స్వాధీన పరచుకుని విచారణ ప్రారంభించారు.
వరకట్న వేధింపులతో మహిళ ఆత్మహత్య
రాయగడ: వరకట్న వేధింపులు తాళలేక ఒక వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లా లోని అంబొదల పోలీస్‌స్టేషన్ పరిధిలో గల కు కుడాబారు గ్రామంలో చోటు చేసుకుంది. శని వారం సాయంత్రం జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఎస్‌డీపీఓ సంతొషిణి ఓరం, ఐఐసీ కల్పన బెహరా ఇతర పోలీస్ సిబ్బంది సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు. అయితే తన కూతురు ఆత్మహత్యకు పాల్పడలేదని, ఇది హత్య అని బాధితురాలి తల్లిదండ్రులు అంబొదల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు..
అంబొదల పోలీస్ స్టేషన్ పరిధిలో గల రఘు బారి పంచాయతీలోని ఖలియాగుడ గ్రామానికి చెందిన పరిక్షిత్ బిబార్ కూతురైన సోనియా బిబార్ నాలుగేళ్ల కిందట కుకుడాబారు గ్రామానికి చెందిన అకుల్ కులదీప్ కొడుకై న ఆశీష్‌తో ప్రేమవివాహం చేసుకుంది. రెండేళ్లుగా ఆమె వరకట్న వేధింపులు ఎదుర్కొంటోంది. అత్తమామలతో పాటు భర్త కూడా వరకట్నం గురించి వేధిస్తుండేవాడు. ఈ క్రమంలో గత దీపావళి నాడు సోనియా వరకట్న వేధింపులను తట్టుకోలేక తన పుట్టింటికి వెళ్లిపోయింది. గత శుక్రవారం సోనియా భర్త ఆశీష్ నచ్చజెప్పి తిరిగి తన ఇంటికి తీసుకువెళ్లాడు. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం కుకుడాబారు ఆదివాసీ వీధి చివర ఒక చెట్టుకు ఉరివేసుకుని ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. అక్కడి వారు కొందరు చెట్టుకు వేలాడుతున్న మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం బాధిత కుటుంబానికి సమాచారం అందించిన పోలీసులు వారి సమక్షంలో మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment