ఉన్నత విద్యకు ప్రాధాన్యం
పర్లాకిమిడి: ఉన్నత విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులు అన్నారు. స్థానిక కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి స్వపరిపాలన వారోత్సవాలు, గుడ్ గవర్ననెన్స్ కార్యక్రమం సోమవారం జరిగింది. కార్యక్రమానికి ఏడీఎం రాజేంద్ర మింజ్ అధ్యక్షత వహించగా.. ముఖ్యఅతిథిగా విశ్రాంత ఐఏఎస్ అధికారి పవిత్ర మండళ్, డీఆర్‌డీఏ ఆదనపు కార్యనిర్వాహణాఽధికారి ఫృథ్వీరాజ్ మండళ్, జిల్లా ముఖ్య విద్యాధికారి మయాధర్ స్వయిని పాల్గొన్నారు. వర్క్‌షాపులో ఉన్నత విద్య, ఆరోగ్యం, శిశువికాస్, గ్రామీణ స్థాయిలో సాధారణ వినతుల పరిష్కారంపై అధికారులు చర్చించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదం మేరకు ఈనెల 19 నుంచి 24వ తేదీ వరకూ అన్ని మండలాలు, గ్రామపంచాయతీ స్థాయిలో గుడ్ గవర్నన్స్ వారోత్సవాలు జరుగుతున్నాయని ఏడీఎం రాజేంద్ర మింజ్ అన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో పాటు డిప్యూటీ కలెక్టర్ లిపినా దాస్, కమలకాంత పండా, కష్యప్ బెహరా పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలు
చేయకపోతే 26న బంద్
●ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి
జయపురం: కొరాపుట్ జిల్లాలో ఈ నెల 25వ తేదీలోగా మండీలలో ధాన్యం కొనుగోలు చేయకపోతే 26వ తేదీన జిల్లా బంద్ చేస్తామని జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి హెచ్చరించారు. సోమవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులను అధికార బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. పౌరసరఫరాల మంత్రి ఇటీవల జయపురంలో పర్యటించిన సందర్భంగా మండీలలో ధాన్యం కొనుగోలులో ఎటువంటి అవకతవకలకు తావు ఉండదని, రైతులు పండించిన ప్రతీ ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారని..అయితే క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదన్నారు. ఇచ్చిన హామీని నేరవేర్చడంలో విఫలమయ్యారని ఆరోపించారు. రాష్ట్రంలో 80 శాతం ప్రజలు వ్యవసాయంపైనే ఆధారసడి జీవిస్తున్నారని అన్నారు. ఇప్పటికే రైతులు ధాన్యాన్ని మండీలకు తీసుకువచ్చారని వెల్లడించారు. అకాల వర్షాలు, పొగ మంచు కారణంగా ధాన్యంపై కప్పేందుకు టార్ఫాలిన్లను సైతం కొనుగోలు చేయలేని దుస్థితిలో రైతులు ఉన్నారన్నారు. ప్రభుత్వం రైతులకు కేవలం టోకెన్లను ఇచ్చి చేతులు దులుపుకుందని విమర్శించారు. టోకెన్ల కాల గడువు కేవలం ఒక నెల కావటంతో పాలకులు ఎప్పుడు ధాన్యం కొంటారో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. ధాన్యాన్ని ఎప్పుడు కొనుగోలు చేస్తారో ప్రభుత్వం ప్రకటించాలని ఎమ్మెల్యే బాహిణీపతి డిమాండ్ చేశారు. ఎటువంటి నిబంధనలు లేకుండా రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ నరేంద్ర కుమార్ మహంతి, జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు భవాణీ శంకర రత్, జయపురం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బసంత నాయక్, రైతు ఉగ్రసేన్ మండల్ ప్రతినిధులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో వివాహిత మృతి
మల్కన్‌గిరి: రోడ్డు ప్రమాదంలో వివాహిత ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన మల్కన్‌గిరి జిల్లా పోడియా సమితి కుమార్‌గూఢ గ్రామం వద్ద ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నందగూడ గ్రామానికి చెందిన రామే బేటీ తన భార్య షింగే బేటీ(33)తో కలిసి ద్విచక్ర వాహనంపై పోడియ గ్రామానికి సామాన్ల కొనుగోలు కోసం వచ్చారు. రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో తిరిగి వెళ్తుండగా అజాయ్ కరామ్ అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై అతివేగంగా వచ్చి రామే బేటీ వాహనాన్ని బలంగా ఢీకొట్టాడు. దీంతో షింగే బేటీ రోడ్డుపై ఉన్న రాయిపై పడిపోవడంతో తలకు బలమైన గాయమైంది. అటుగా వెళ్తున్నవారు పోడియ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని షింగే బేటీని పోడియ ఆరోగ్య కేంద్రానికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కలిమెల ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రమాదానికి కారణకునిగా భావిస్తున్న అజాయ్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment