13 నుంచి 20 వరకు.. జయపురంలో పుష్యపుణి ఉత్సవాలు
జయపురం: జయపురంలో గత ఐదేళ్లుగా అంగరంగ వైభవంగా జరుపుతున్న పుష్యపుణి ఉత్సవాలను ఈసారి కూడా ఘనంగా నిర్వహించాలని కళా బృందాలు నిశ్చయించాయి. జనవరి 13 నుంచి 20వ తేదీ వరకు ఉత్సవాలను ఆడంబరంగా జరపాలని మంగళవారం నిర్వహించిన సన్నాహాక సమావేశంలో నిర్ణయించారు. కొరాపుటియ కళా, కళాకారుల సంఘం నిర్వహించిన సమావేశలో పలువురు కళాకారులు పాల్గొన్నారు. గత ఏడాదికంటే ఘనంగా ఈసా పుష్యపుణి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరపాలని నిర్ణయించింది. తొలిరోజున స్థానిక కళాకారులతో విశాల ర్యాలీ నిర్వహించాలని తీర్మానించారు. బంకమఠ నుంచి కళాకారుల ర్యాలీ ప్రారంభమై జయపురం ప్రభుత్వ ఉన్నత పాఠాశాల మైదానం వద్ద ముగించాలని భావిస్తున్నారు. రోజూ నృత్య నాట్యాల ప్రదర్శన ఉంటుందన్నారు. ఉత్సవాల్లో ఒడిశాలో ప్రసిద్ధ గాయకులు అమీష పండ, అనూరాధా పాణిగ్రహిలు పాల్గొంటారని ప్రముఖ సంగీత కళాకారులు ధిరెన్ పట్నాయక్ వెల్లడించారు. అలాగే ఒడియా కంఠ శిల్పులను, తెలుగు చలన చిత్ర కళాకారులను ఆహ్వానిస్తున్నామన్నారు. పుష్యపుణి సంపూర్ణ కార్యక్రమం త్వరలో జరుగనున్న సమావేశంలో నిర్ణయించనున్నట్లు వెల్లడించారు. ఉత్సవాల సందర్భంగా పౌరాణిక వేషాలు, ఆదివాసీ వేష పోటీలు, జయపురంలోని వివిధ నాట్య సంస్థలచే నాటక పోటీలు, కొరాపుట్ చిన్న సినీమాల ప్రదర్శణ పోటీలు ఉంటాయన్నారు. అలాగే తొలిసారిగా కవితా పఠన పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. పల్లెశ్రీ మేళా, మీణా బజార్, ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఈ నెల 26 వ తేదీన ఆవిష్కరిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో ప్రముఖ కళాకారులు జయంత సాంత, మనోజ్ కుమార్ పాత్రో, శ్రీకాత దాస్, ప్రియూష పట్నాయక్, గుప్తేశ్వర పాణిగ్రహి, జి.మహేష్, మురళీ పట్నాయక్, కమళా కాంత రథ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment