నేనూ చిట్‌ఫండ్ బాధితుడినే: సీఎం
భువనేశ్వర్: రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపిన చిట్‌ఫండ్ మోసాల్లో తాను బాధితుడినేనని రాష్ట్ర ముఖ్యమత్రి మోహన్ చరణ్ మాఝి ప్రకటించారు. స్థానిక లోక్ సేవా భవన్‌లో మంగళవారం నిర్వహించిన జాతీయ వినియోగదారుల దినం సభా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వరుసగా 1990 మరియు 2002 సంవత్సరాల్లో 2 సార్లు చిట్ ఫండ్ కుంభకోణాలకు గురైనట్లు ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ప్రకటించారు. వినియోగదారుల రక్షణ కోసం తొలి సారిగా భారత ప్రభుత్వం 1986 సంవత్సరంలో వినియోగదారుల చట్టం ప్రవేశ పెట్టింది. నరేంద్ర మోదీ సర్కారు 2019 సంవత్సరంలో సరికొత్త సవరణలు, సంస్కరణలతో ఈ చట్టాన్ని మరింత బలోపేతం చేసింది. మరో వైపు చట్ట ప్రయోజనాలు సాధారణ వినియోగదారులు సులభంగా వినియోగించేందుకు మార్గం సుగమం చేసింది. అలాగే చిట్ ఫండ్స్ చట్టంలో మోదీ ప్రభుత్వం సవరణలు చేసి చిట్ ఫండ్ పథకాల్లో పారదర్శకతకు పదును పెట్టిందని, దీంతో పాత లొసుగులు తొలగిపోయి వినియోగదారులకు ప్రయోజనకరంగా నిలుస్తుందని సీఎం అన్నారు. రాష్ట్రంలో నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని మునుపటి బిజూ జనతా దళ్ ప్రభుత్వం చిట్‌ఫండ్ మోసాలపై విచారణకు ప్రత్యేక న్యాయ కమిషన్ ఏర్పాటు చేసింది. సన్నకారు ఖాతాదారులకు మోసపోయిన సొమ్ము ఫిరాయించేందుకు 2013 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.300 కోట్ల కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేసింది. జస్టిస్ ఎంఎం దాస్ అధ్యక్షతన న్యాయ కమిషన్ సుమారు 1,00,000 మంది సన్నకారు బాధిత ఖాతాదారులను గుర్తించింది. వీరంతా రూ.10,000 లేదా అంతకంటే తక్కువ సొమ్ము చిట్‌ఫండ్‌లో పెట్టుబడి పెట్టిన వారుగా న్యాయ కమిషను పేర్కొందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. రాష్ట్రంలో చిట్‌ఫండ్ కుంభకోణంలో ప్రభావితమైన దాదాపు 2 లక్షల మంది సన్నకారు పెట్టుబడిదారులకు తమ డబ్బును తిరిగి పొందారని ముఖ్యమంత్రి తెలిపారు. ఒడిశాలోని 35 అక్రమ ఆర్థిక సంస్థలకు చెందిన 1,472.428 ఎకరాల విస్తీర్ణపు స్థిరాస్తులను అధికారులు జప్తు చేసినట్లు ముఖ్యమంత్రి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment