చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
పార్వతీపురం: వినియోగదారుల చట్టాలపై ప్రజలందరికీ అవగాహన ఉండాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్‌ప్రసాద్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో పౌరసరఫరాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ వినియోగదారుల దినోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి పౌరుడు చట్టాల గురించి తెలుసుకోవాలని సూచించారు. విద్యార్థి దశనుంచే చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. వినియోగదారుల చట్టాలపై అవగాహన కల్పించేందుకు వినియోగదారుల క్లబ్‌లను నిర్వహిస్తున్నామన్నారు. పాలిథిన్ కవర్లు, ప్లాస్టిక్ బాక్సుల్లోని తినుబండారాలు, రోడ్లపై బండ్ల వద్ద తయారయ్యే కలుషిత ఆహారా న్ని తినడం వల్ల క్యాన్సర్ వంటి రోగాలు వచ్చే ఆస్కారం ఉంటుందని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు స్వచ్ఛ సుందర పార్వతీపురం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇటీవల సైబర్ క్రైం, ఈ–కామర్స్ మోసాలకు గురవుతున్నారని, దీనిపై వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. వినియోగదారుల దినోత్సవం సందర్భంగా కళాశాల, పాఠశాల స్థాయిలో నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను, సర్టిఫికెట్లను కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా మేలుకొలుపు పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం వినియోగదారులను చైతన్యపరిచే పలు సంస్థల వలంటీర్లను సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ శాఖల ప్రదర్శన స్టాల్స్‌ను తిలకించారు. కార్యక్రమంలో కేఆర్‌ఆర్‌సీ ప్రత్యేక ఉప కలెక్టర్ టి.ధర్మ చంద్రారెడ్డి, వైద్యారోగ్య శాఖ జిల్లా ప్రోగ్రాం అధికారి టి. జగన్‌మోహన్‌రావు, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ టి. శ్రీనివాసరావు, లీగల్ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్ కె. రత్నరాజు, జిల్లా ఆహార తనిఖీ అధికారి ఎ.రామయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment