ఒడిశా వికాసంలో విద్యార్థుల పాత్ర కీలకం: సీఎం
భువనేశ్వర్: వికసిత ఒడిశా రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని, రాష్ట్ర అవతణ శతాబ్ది పురస్కరించుకుని 2036 నాటికి ఈ ధ్యేయం సాధించాలనే దృఢ సంకల్పంతో తొలి రోజు నుంచి ప్రభుత్వ కార్యాచరణ ఆరంభమైందని, ఈ కార్యాచరణలో విద్యార్థులు ముందంజ సేనగా నిలవాలని సీఎం మోహన్ చరణ్ పిలుపునిచ్చారు. కటక్ ఇండోర్ స్టేడియంలో గురువారం జరిగిన అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీవీపీ 49వ రాష్ట్ర స్థాయి సమావేశాల ప్రారంభోత్సవం పురస్కరించుకుని ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో యువ నాయకత్వం జాతీయ ప్రయోజనాలకు ప్రాముఖ్యత ఇస్తుందని తెలిపారు. మన వారసత్వాన్ని, సనాతన సంప్రదాయాన్ని పతాక స్థాయిలో రెపరెపలాడించడంలో సహాయపడుతుందని ప్రోత్సహించారు.
విద్యార్థి లోకం వర్థిల్లుతుంది
విద్యార్థుల ఉజ్వల భవిష్యత్‌ను నిర్ధారించడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, వికసిత ఒడిశాలో విద్యార్థి లోకం అగ్ర స్థానంలో ప్రాధాన్యత సంతరించుకోవడం తథ్యమని అన్నారు. రాష్ట్రంలో విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ప్రాధాన్యమిచ్చేలా ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. విద్యార్థుల పరీక్షలు, ఉపాధ్యాయ, అధ్యాపక నియామక ప్రక్రియను క్రమబద్ధీకరించేందుకు జాతీయ విద్యా విధానం–2020 (ఎన్‌ఈపీ) రాష్ట్రంలో అమలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు.
త్వరలో ఎన్నికలు
గత కొన్ని సంవత్సరాలుగా నిలిచి పోయిన విద్యార్థి సంఘం ఎన్నికలు కొత్త విద్యా సంవత్సరం నుంచి పునరుద్ధరిస్తుందని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి విద్యార్థులకు వాగ్దానం చేశారు. సుసంపన్న ఒడిశా ఆవిష్కరణకు విద్యార్థి వర్గం సహకారం, ప్రమేయం అవసరమని, ఈ నేపథ్యంలో విద్యార్థి సంఘం ఎన్నికలు ప్రాధాన్యత సంతరించుకుంటాయని తెలిపారు. 2018 సంవత్సరం నుంచి పలు కారణాలు, పరిస్థితుల మధ్య రాష్ట్రంలో విద్యార్థి సంఘం ఎన్నికలు నిలిచి పోయాయి. తుపాను వంటి ప్రకృతి వైపరీత్యాలు, కోవిడ్ – 19 తాండవం, విద్యా సంస్థల్లో అశాంతి వాతావరణం వంటి పరిస్థితుల ప్రభావంతో రాష్ట్రంలో విద్యార్థి సంఘాల ఎన్నికలు నిలిచిపోయాయి. ముఖ్యమంత్రి తాజా హామీ ప్రకారం కొత్త విద్యా సంవత్సరం నుంచి ఈ ఎన్నికల పునరుద్ధరణ జరుగుతుందనే నమ్మకం విద్యార్థి వర్గాన్ని ఉత్సాహపరిచింది.
Comments
Please login to add a commentAdd a comment