శ్రీకాకుళం అర్బన్: పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా బహిరంగ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి, పార్లమెంట్ సభ్యుడు మాణిక్యం ఠాగూర్ డిమాండ్ చేశారు. ఏఐసీసీ, పీసీసీ ఆదేశాల మేరకు గురువారం జిల్లా పర్యటన విచ్చేసిన ఆయన గార మండలం అంబటివానిపేటలో జై బాపూజీ.. జై భీమ్.. జై సంవిధాన్.. కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. భారతదేశ ప్రజలకు భగవద్గీత లాంటి పవిత్రమైన రాజ్యాంగాన్ని, రాసిన అంబేడ్కర్‌ను కించపరుస్తూ అమిత్‌షా వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. అంతకుముందు అంబేడ్కర్ విగ్రహానికి షేక్ మస్తాన్‌వలి, గిడుగు రుద్రరాజు, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు లక్కరాజు రామారావు, మమతా నాగిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు అంబటి కృష్ణారావు, జిల్లా ఇన్‌చార్జ్ గాధం వెంకటరమణ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రెల్ల సురేష్, కేవీఎల్‌ఎస్ ఈశ్వరి, తెంబూరు మధుసూదన్‌రావు, పూడి కిరణ్‌కుమార్, నియోజకవర్గాల ఇన్‌చార్జులు చక్రవర్తి రెడ్డి, మామిడి సత్యనారాయణ, ఆబోతుల వెంకట్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. కాగా, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రస్థాయి అగ్రనేతలు శ్రీకాకుళం జిల్లా పర్యటనకు రాగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు, గత ఎన్నికల్లో పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసిన వారు గైర్హాజరు కావడం చర్చనీయాంశమైంది. దీనికి కారణం పార్టీలో కొనసాగుతున్న అంతర్గత విభేదాలేనని చెబుతున్నారు. గైర్హాజరైన వారిలో కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, మాజీ డీసీసీ అధ్యక్షుడు పేడాడ పరమేశ్వరరావు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జిలు సనపల అన్నాజీరావు, మంత్రి నరసింహమూర్తి, కొప్పురోతు వెంకటరావు, కరిమజ్జి మల్లేశ్వరరావు, కోత మధుసూధనరావు, చింతాడ దిలీప్, కొర్రాయి ప్రసాదరావు, కె.శైలజ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment